బ్యాడ్మింటన్‌ పోటీలకు న్యాయనిర్ణేతగా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ పోటీలకు న్యాయనిర్ణేతగా ఎంపిక

Aug 11 2026 12:36 AM | Updated on Aug 11 2026 12:36 AM

రాజుపాళెం : రాజుపాళెం మండలంలోని వెలవలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పీడీ సి.చంద్ర ఓబుళ రెడ్డికి ఢిల్లీలో జరిగే పోటీలకు రావాలని పిలుపు వచ్చింది. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ఢిల్లీలో జరగబోవు బ్యాడ్మింటన్‌ ఓల్డ్‌ చాంపియన్‌ 2026 టోర్నమెంట్‌కు న్యాయ నిర్ణీతగా ఎంపికై నట్లు ఆయన సోమవారం తెలిపారు. ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

లయోలా కళాశాలకు ‘అటానమస్‌’ హోదా

పులివెందుల టౌన్‌ : స్థానిక లయోలా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్వయంప్రతిపత్తి హోదాను మంజూరు చేసిందని కళాశాల ప్రిన్సిపల్‌ ఫాదర్‌ జోజిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హోదా 2026–27 నుంచి 2030–31 వరకు ఐదు విద్యా సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని, కళాశాల ప్రస్థానంలో ఇది ఒక చరిత్రాత్మక మైలురాయి అని చెప్పారు. 1979లో స్థాపించిన లయోలా కళాశాల నాణ్యమైన విద్యా సేవలకు దక్కిన గుర్తింపుగా దీనిని భావించవచ్చునన్నారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి పునాది వేసిన వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు దివంగత వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ జయమ్మ, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డిలను ఆయన గుర్తుచేసుకున్నారు. దశాబ్దాలుగా సేవలు అందించిన సిబ్బందికి, పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

లారీని ఢీకొన్న కారు: వ్యక్తి మృతి

చెన్నూరు (వల్లూరు) : హైదరాబాద్‌ నుంచి పుత్తూరుకు వెళుతున్న కారు చెన్నూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాత టోల్గేట్‌ వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. హ్యుందాయ్‌ వెన్యూ ఏపీ 07 జేయూ 2869 అనే కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌ కం ఓనర్‌ వెంకట శివకుమార్‌రాజు, ఆయన తల్లి దాసర మంగమ్మ సురక్షితంగా బయటపడ్డారు. వెనక సీటులో ప్రయాణిస్తున్న వారిలో వారి దగ్గరే పనిచేస్తున్న ముగ్గురు బీహారీ కార్మికులు ఉన్నారు. కారు ఢీ కొట్టిన కుదుపుకు వెనక సీటులో ఉన్న ముగ్గురిలో మధ్యలో కూర్చున్న పవన్‌ కోమన్‌ (48) అనే వ్యక్తి అద్దాలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చెన్నూరు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగులపై ప్రభుత్వం ‘విషప్రచారం’

బద్వేలు (అట్లూరు): శ్వేతపత్రం విడుదల పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మదన విజయకుమార్‌ మండిపడ్డారు. సోమవారం బద్వేలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద యూటీఎఫ్‌ 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగుల అండతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వారిని పూర్తిగా విస్మరించిందన్నారు. పీఆర్సీ గడువు ముగిసి మూడున్నరేళ్లు దాటినా 12వ పీఆర్సీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. చెల్లించాల్సిన ఐదు డీఏలలో ఒక్కటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని, ఆర్థిక బకాయిలు పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. బడ్జెట్‌లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కేవలం 28.4 శాతమే కేటాయించినప్పటికీ, 95 శాతం జీతాలకే పోతోందంటూ తప్పుడు ప్రచారం చేయడం వెనుక 12వ పీఆర్సీలో అన్యాయం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా నాయకులు సుధాకర్‌, శివప్రసాద్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement