‘క్విట్‌ కార్పొరేట్‌’.. కార్మికులు, రైతుల ఉమ్మడి గర్జన | - | Sakshi
Sakshi News home page

‘క్విట్‌ కార్పొరేట్‌’.. కార్మికులు, రైతుల ఉమ్మడి గర్జన

Aug 11 2026 12:36 AM | Updated on Aug 11 2026 12:36 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రయోజనాలను కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ క్విట్‌ ఇండియా డే సందర్భంగా కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉమ్మడి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. ‘క్విట్‌ కార్పొరేట్‌– దేశ్‌ కో బచావో‘ నినాదంతో జరిగిన ఈ ధర్నాలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు మనోహర్‌, బాదుల్లా, దస్తగిరి రెడ్డి, అన్వేష్‌, ఎం.వి.సుబ్బారెడ్డి, వేణుగోపాల్‌ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో కార్పొరేట్‌ శక్తులకు చెందిన దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను ‘రైటాఫ్‌’ పేరుతో కేంద్రం మాఫీ చేసిందని నాయకులు మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి రుణాలు మాఫీ చేయడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ధ్వజమెత్తారు. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే, బొగ్గు గనులను అదానీ వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, సామాన్యులపై పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లాభాలు పెంచుతూ ప్రజల సంపదను లూటీ చేస్తున్న శక్తులను దేశం నుంచి తరిమికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా ’జీ రామ్‌ జీ’ బిల్లును తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులకు ఉపాధిని దూరం చేశారని ధ్వజమెత్తారు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు వెంకటసుబ్బయ్య, రామ్మోహన్‌, చంద్రారెడ్డి, వేణుగోపాల్‌, మద్దిలేటి, సుంకర రవి, రైతు సంఘం నాయకులు గోపాలకృష్ణయ్య, చిన్న సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement