సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి

Aug 11 2026 12:36 AM | Updated on Aug 11 2026 12:36 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : వికసిత భారత్‌ లక్ష్యాలను అధిగమిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తితో వైఎస్సార్‌ కడపజిల్లాను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధీమీనా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సభాభవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో జేసీ డీఆర్వో మల్లికార్జునుడుతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో జేసీ నిధీమీనా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) ద్వారా అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌లను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ప్రత్యామ్నాయ సాగు విధానాలపై జిల్లా ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచాలని జేసీ అధికారులకు సూచించారు. ఇందుకోసం నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, ఎస్డీసీ వెంకటపతి, డిప్యూటీ కలెక్టర్లు శివ రామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ పాల్గొన్నారు.

దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

దేశ స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో మరింతగా చాటుతూ, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించేలా దేశ నిర్మాణంలో భాగస్వాములు అనే కార్యక్రమాలను జిల్లాలో ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ నిధిమీనా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్ద, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. యువత, విద్యార్థులు, ప్రముఖులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ‘‘అనే నేను’’ సామాజిక మాధ్యమ ప్రచారంలో పాల్గొనాలని కోరారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ‘‘అనే నేను... దేశ అభివృద్ధి కోసం నా వంతుగా...’’ అంటూ 30 నుంచి 60 సెకన్ల స్వీయ వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని సూచించారు.

జేసీ డాక్టర్‌ నిధి మీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement