ఖాకీ వనం.. అవినీతికి నిలయం! | - | Sakshi
Sakshi News home page

ఖాకీ వనం.. అవినీతికి నిలయం!

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

వీఆర్‌కు మరో కానిస్టేబుల్‌ ప్రైవేట్‌ వ్యక్తి కీలకపాత్ర

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : కలసపాడు పోలీసుస్టేషన్‌లో అవినీతి మితిమీరిపోయింది. జిల్లా సరిహద్దు స్టేషన్‌ కావడం, జిల్లా పోలీసు అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో స్టేషన్‌ అధికారితో పాటు సిబ్బంది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. స్టేషన్‌కు వచ్చిన చిన్నాచితక జనాలను కూడా వదలకుండా ప్రైవేట్‌ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పోరుమామిళ్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పలుమార్లు సిబ్బందిని, అధికారిని హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోగా ఓ చిన్న కేసు విషయంలో రూ.లక్ష డిమాండ్‌ చేసి రూ.80 వేలు వసూలు చేసిన విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ నెల 2వ తేదీన జిల్లా సరిహద్దులోని నీలాపురం సమీపంలోని కంపచెట్లలో కలసపాడు మండలానికి చెందిన కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. స్టేషన్‌ అధికారితో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన సిబ్బంది పేకాట స్థావరంపై దాడి నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కలసపాడుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువు ఉండటంతో కొందరు అతన్ని తప్పించేందుకు పోలీసులను సంప్రదించారు. ఇదే అవకాశంగా భావించిన పోలీసులు రూ.లక్ష డిమాండ్‌ చేయగా రూ.80 వేలకు బేరం కుదిరినట్లు తెలిసింది. ఆ వ్యక్తి పేరు స్థానంలో మరొకరి పేరు చేర్చి ఈ నెల 2వ తేదీన కేసు నమోదు చేశారు. రూ.80 వేలలో రూ.20 వేలు ప్రైవేట్‌ వ్యక్తికి ఫోన్‌పే ద్వారా చెల్లించారు. మిగిలిన రూ.60 వేలు నగదును ఓ కానిస్టేబుల్‌కు అందజేశారు. ఈ విషయం 3వ తేదీన చర్చాంశనీయం కావడంతో పోరుమామిళ్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోలీసు సిబ్బందిని మందలించారు. పోలీసులు హుటాహుటిన కలసపాడుకు చెందిన ఆ వ్యక్తి పేరును తిరిగి ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారు. స్టేషన్‌లో విషయం బయటికి చెప్పడానికి కారణం రాజ్‌కుమార్‌ అనే కానిస్టేబుల్‌ అని భావించి బుధవారం కడపలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. పేకాటలో వసూలు చేసింది కొందరైతే మరో కానిస్టేబుల్‌ బలి కావడం జిల్లా పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చాంశమైంది. కలసపాడు పోలీసుస్టేషన్‌లో ప్రైవేట్‌ వ్యక్తి గత కొంత కాలంగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. పోలీసు అధికారితో పాటు సిబ్బందికి అనుకూలంగా ఉంటూ స్టేషన్‌కు వచ్చిన ప్రజలను వివిధ రూపాలుగా వేధించి వసూళ్లపర్వం మొదలుపెట్టాడు. పోలీసు ఉన్నతాధికారులు కలసపాడు పోలీసుస్టేషన్‌లో సమర్ధవంతమైన సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆ కానిస్టేబుల్‌ కీలకపాత్ర

కలసపాడు పోలీసుస్టేషన్‌లో జరిగే అవినీతి, అక్రమాలలో కడప స్పెషల్‌ బ్రాంచ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. పాస్‌పోర్టు తనిఖీలు నిర్వహించి గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే పసిగట్టి జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించాల్సిన కానిస్టేబుల్‌ తమ విధిని మరించి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారికి వెన్నుదన్నుగా ఉంటే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం స్టేషన్‌ అధికారికి తెలిసినప్పటికీ స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను వెనకేసుకుని రావడం కలసపాడు ప్రాంతంలో చర్చాంశనీయమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement