వల్లూరు: మండల పరిధిలోని తోల్లగంగనపల్లి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వల్లూరుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కడప నుంచి ఎర్రగుంట్లకు వెళుతున్న ట్రాక్టర్‌ను డ్రైవర్ తోల్లగంగనపల్లె సమీపంలో నిలిపి సెల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా అదే సమయంలో కడప నుంచి కూరగాయలు లోడ్ చేసుకుని, కొంతమంది ప్రయాణికులతో కమలాపురం వైపునకు ప్రయాణిస్తున్న ఆటో నిలిపి ఉన్న ట్రాక్టర్ వెనుక భాగాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, ఆటోలో ఉన్న కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వల్లూరుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి గాయపడ్డాడు. చికిత్స కోసం అతడిని స్థానికులు వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
రూ.కోట్ల విలువైన
ప్రభుత్వ స్థలంపై టీడీపీ నేత కన్ను
– సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బోర్డును ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండలంలోని పొట్టిపాడు రోడ్డులో ఉన్న రూ.కోట్ల విలువ చేసే కుంట పోరంబోకు స్థలాన్ని ఆక్రమించేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారు. సర్వే నంబర్ 231ఏలో 2.38 ఎకరాల కుంట పోరంబోకు స్థలం ఉంది. స్థలం చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పదేళ్ల క్రితం ఓ మాజీ ఎమ్మెల్యే ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకుని కంచె ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ స్థలాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ నేత బుధవారం నుంచి ఈ స్థలాన్ని జేసీబీతో చదును చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు తమ సిబ్బందిని పంపి అడ్డుకున్నారు. స్థలం వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
కుంట పోరంబోకు స్థలాన్ని జేసీబీతో చదును చేస్తున్న దృశ్యం,
హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు


