● దారుణంగా పడిపోయిన
పంటల సాగు
● పలు గ్రామాల్లో తాగునీటికి కటకట
● కంటి తుడుపు చర్యలతో
సరిపెట్టాలని చూస్తున్న ప్రభుత్వం
కడప సెవెన్‌రోడ్స్ : ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వర్షించలేదు. అధిక వర్షపాతలోటుతో జిల్లాలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం రోజురోజుకు పడిపోతోంది. ఖరీఫ్ పంటల సాధారణ సాగు దారుణంగా పడిపోయింది. పలు గ్రామాల్లో తాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి దాపురించింది. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో విసిరిన సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేటప్టకుండా కంటి తుడుపు చర్యలకే పరిమితమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి తాగు, సాగునీటిని విడుదల చేయడమే పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వికటించిన నైరుతి
ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు ముఖం చాటేశాయి. అక్కడక్కడా చిన్నపాటి వర్షం నమోదవడం మినహా ప్రయోజనం లేదు. జూన్‌లో సాధారణ వర్షపాతం 69,1 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 47.9 మి.మీ. మాత్రమే నమోదు కావడంతో –30.7 శాతం లోటు ఏర్పడింది. జులైలో 96.5 మి.మీ. సాధారణ వర్షపాతానికి 21.6 మి.మీ. మాత్రమే నమోదై –77.6 శాతం లోటు ఏర్పడింది. మొత్తం మీద జూన్, జులై నెలల్లో జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే 165.6 మిల్లిమీటర్లకు 69.5 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే 58 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఇది ఖరీఫ్ పంటల సాగుపై తీవ్ర ప్రభావం నెరిపింది. జిల్లాలో వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది, ఆముదం, కొర్ర, సజ్జ, పెసర, పొద్దుతిరుగుడు, మినుము, వరి తదితర పంటలు ఖరీఫ్‌లో సాగు చేస్తారు. సాధారణ సాగు విసీ్త్రర్ణం 76,496 హెక్టార్లు కాగా, 13,086 హెక్టార్లలోనే వివిధ పంటలు సాగయ్యాయి. అంటే మొత్తం సాధారణ సాగులో 17.1 శాతం మాత్రమే పంటలు వేశారు.
తాగునీటికి కటకట!
జిల్లాలోని చక్రాయపేట, లింగాల, వేముల, వేంపల్లె, వీరబల్లి, సుండుపల్లె, కాశినాయన, పోరుమామిళ్ల, మైలవరం మండలాల్లో భూగర్బ జలమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మైలవరం, వీరబల్లి, చక్రాయపేట మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటిని రవాణా చేస్తున్నారు. మిగతా మండలాల్లో వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకుని ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. కడప నగరానికి తాగునీరు అందించేందుకు మైలవరం నుంచి 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. వర్షభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాగునీటి సమస్య మరిన్ని మండలాలకు విస్తరిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆందోళన కల్గిస్తున్న
రిజర్వాయర్ల నీటిమట్టం
జిల్లాలో తెలుగుగంగ, గాలేరు–నగరి, సీబీఆర్, కేసీ కెనాల్ కింద ప్రధానంగా నీటి పారుదల సౌకర్యం ఉంది. అయితే, వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలో నీటిమట్టం వేగంగా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగుగంగలో అంతర్బాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో 17.740 టీఎంసీలకుగాను 9.109 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుత లెవెల్ 672.169 అడుగులు ఉంది. ఫ్లడ్ కుషన్ 8.631 టీఎంసీ. ఇన్‌ఫ్లో లేదు. టీజీపీలో అంతర్బాగమైన ఎస్‌ఆర్–1లో 2.135 టీఎంసీకిగాను 0.672, ఎస్‌ఆర్–2లో 2.405కుగాను 0.893 టీఎంసీలు ఉన్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10.229 టీఎంసీలకుగాను 3.322 టీఎంసీలు ఉన్నాయి. గాలేరు–నగరిలో అంతర్బాగమైన గండికోట రిజర్వాయర్‌లో 26.850 టీఎంసీలకుగాను 15.813, మైలవరంలో 6.500కుగాను 2.427, పైడిపాలెంలో 6.000 టీఎంసీలకుగాను 3.171 టీఎంసీ, వామికొండలో 1.660 టీఎంసీలకుగాను 0.657 టీఎంసీలు, సర్వరాయసాగర్‌లో 1.060కుగాను 0.411 టీఎంసీలు ఉన్నాయి.
గ్రాస్ కెపాసిటీ ప్రస్తుత లెవెల్ ప్రస్తుత స్టోరేజీ ఫ్లడ్‌కుషన్ ఇన్‌ఫ్లో
(టీఎంసీలలో) (అడుగుల్లో) (టీఎంసీలలో) (టీఎంసీలు) (క్యూసెక్కుల్లో)
215 864.701 121.246 94.564 2,41,779
బుధవారం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ఇలా ఉంది


