కడప అర్బన్: జాతీయ న్యాయ సేవా సంస్థ (నల్సా) ఆధ్వర్యంలో మీడియేషన్ 3.0 కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులకు మధ్యవర్తిత్వ విధానం, దాని ప్రయోజనాలు, వివాదాల సత్వర పరిష్కారంలో మధ్యవర్తిత్వం పాత్రపై కడపలోని న్యాయ సేవా సదన్‌లో బుధవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ మాట్లాడుతూ మీడియేషన్ 3.0 పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గతంలో 40 గంటల ట్రైనింగ్ తీసుకున్న ఉమ్మడి కడప జిల్లా న్యాయవాదులకు ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు పంపిన సర్టిఫికెట్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని చేతుల మీదుగా అందించారు. సెప్టెంబర్ 12న జరుగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ కాగల కేసులను గురించి చర్చించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయమూర్తులు కోరారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్ 15100, చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నంబర్ 1098, ఉచిత న్యాయ సహాయం తదితరఅంశాలపై అవగాహన కలిగించారు. ఏవైనా సమస్యలుంటే కడపలోని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి తీసుకొని రావచ్చన్నారు. ఈ కార్యక్రమములో ఉమ్మడి కడప జిల్లా న్యాయవాదులు పాల్గొన్నారు.


