రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన కూటమి ప్రభుత్వం

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

జమ్మలమడుగు : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలతో పాటు తమ అనుచరులకు రూపాయికే భూములు కట్టబెట్టి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నట్లు ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. ఇప్పుడు సంపద సృష్టి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. నాడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అవినీతి అక్రమాలకు పాల్పడి రూ.కోట్లు దండుకుంటున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించడంతో పాటు మంత్రి నారా లోకేష్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో నిరుపేదలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గురువారం నుంచి పట్టణంలోని పాత బస్టాండ్‌లో రిలే దీక్షలు ప్రారంభిస్తున్నామన్నారు. కార్యకర్తలు, నాయకులు, నిరుద్యోగులు దీక్షల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement