● ఏర్పాట్లలో ఆలయ అధికారులు
● భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రం గండిలో శ్రావణ మాస ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఏడాదికోసారి నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అంజన్న వైభవం చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇప్పటి వరకు చిన్నగుడిలో అంజన్నను దర్శించుకున్న భక్తులు నేడు ఆలయాన్ని విస్తరించడంతో ఆలయంలోకి అడుగు పెట్టగానే సంస్కృతి ఉట్టిపడేలా, భక్తి భావం ఉప్పొంగేలా కనిపించే భక్తులకు అంజన్న మూలవిరాట్ దర్శనం కలగనుంది. ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావించిన ఆలయ వర్గాలు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఈ ఏడాది శ్రావణ మాసంలో నాలుగు శనివారాల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 13న శ్రావణ మాసం మొదలవనుండటంతో 15న తొలి శనివారోత్సవం, 22న రెండు, 29న మూడు, సెప్టెంబరు 5న చివరి శనివారోత్సవం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, పాలకమండలి సభ్యులు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అద్దాలమర్రి క్రాస్‌తో పాటు వేంపల్లెలోని ప్రధాన కూడళ్ల వద్ద స్వాగత ఆర్చీలు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు ఔట్‌పోస్టు. మెడికల్ క్యాంప్ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లను మొదలు పెట్టారు. పాపాఘ్ని నదిలో నీరు లేనందున భక్తులు స్నానాలు చేసేందుకు స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ సి.విశ్వనాథ్ తెలిపారు. నదిలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, జమ్మును యంత్రాలతో తొలగించినట్లు ఆయన తెలిపారు. స్వామి దర్శనానికి వెళ్లేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు. విద్యుత్తు దీపాలంకరణ నిమిత్తం టెండర్లు కూడా పూర్తి చేశారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేయిస్తున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పాలకవర్గం సమష్టి కృషితో ఏర్పాట్లను చేపట్టింది. పోలీసు, పారిశుద్ధ్య, వైద్యం, విద్యుత్, ఇంజనీరింగ్, రవాణా, అగ్నిమాపక శాఖ తదితర శాఖల అధికారులతో ససమన్వయ సమావేశం నిర్వహించి ఆ మేరకు తగిన ఏర్పాట్లను చేపట్టడమే కాకుండా అందరి సహకారం తీసుకుంటామని ఛైర్మన్ వెంకటస్వామి తెలిపారు. రాత్రి బస చేసే భక్తుల కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వీఐపీ పాసులు ఉండవు
దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉత్సవాల సందర్భంగా స్వామి దర్శనాలకు వచ్చే భక్తులకు ఈ ఏడాది వీఐపీ పాసులు ఇవ్వబోమని ఆలయ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఈ విషయంపై భక్తులు, దాతలు సహకరించాలని కోరారు.


