● ఇచ్చి హామీలు నెరవేర్చకుండానే నంబర్ –1 ఎలా అవుతారు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : గడిచిన రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.3.65 లక్షల కోట్లు అప్పు చేసి దేశంలోనే టాప్‌లో నిలిచారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిలో కాకుండా అప్పులు చేయడంలోనే టాప్ అన్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో చంద్రబాబు గడిచిన రెండేళ్లలో రాష్ట్రానికి రూ.1.50వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని చెప్పారన్నారు. ఈ వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రచురించాయన్నారు. చంద్రబాబు చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. మీడియాలో రాకపోయినా, మేధావులు ఖండించకపోయినా చంద్రబాబు చెప్పే మాటలు వాస్తవమే అని ప్రజలు భ్రమించే అవకాశం ఉందన్నారు. రెండేళ్లుగా అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమించామని చెప్పడం జరిగిందన్నారు. గడిచిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదని రాచమల్లు తెలిపారు. కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని, ఆడ బిడ్డ నిధి ఇవ్వలేదని అన్నారు. అమ్మ ఒడి 80 లక్షల మంది విద్యార్థులుంటే 60 లక్షల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. వాస్తవాలను చెప్పకుండా చంద్రబాబు తాను చేసి సుదీర్ఘ ప్రసంగంలో గొప్పులు చెప్పుకుని జబ్బలు చరుచుకున్నారన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదన్నారు. అలాంటప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబితే ఎలా అని తెలిపారు. రూ.22 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి 22 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పారన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో ఇదే విషయాన్ని ప్రధాన శీర్షికలో ప్రచురించాయన్నారు. కరోనా సమయంలో సైతం రెండేళ్లలో జగన్ రూ.1.31 లక్షల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశారన్నారు. 8.89 కోట్ల మంది లబ్ధిదారులకు, 1.41 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చారన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు లబ్ధి పొందిన వారు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వాతలు, ఎగవేతలు, కోతలతో ప్రభుత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆడ బిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి ఏమైందని, నేతన్న నేస్తం పథకం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి రూ.78వేలు చొప్పున బకాయి ఉందన్నారు. ఎన్నికల ముందు చెప్పినవి కొండంతా ఇప్పుడు అమలు చేస్తున్నవి గోరంత ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉగ్యోలందరిని కలుపుకొని చంద్రబాబు ఉద్యోగాలు ఇస్తున్నామని చెబుతున్నారన్నారు. ఇటీవల తమ పార్టీ ఎంపీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇస్తూ రాష్ట్రంలో రూ.6వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, వాటి నిర్మాణం పూర్తయితే 23వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పిందని తెలిపారు. సంపద సృష్టించి పేదలకు పంపిణీ చేస్తానని చెప్పిన గొప్ప మనిషి ఇప్పుడు సంపద సృష్టి అంటే సంతానం కనడం అని చంద్రబాబు కొత్త నిర్వచనం చెప్పారన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


