పులివెందుల : భారతీయ రైల్వేలో గుర్తింపు పొందిన (అక్రిడిటెడ్) జర్నలిస్టులకు రైలు ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్రమోడి, కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్వని వైష్ణవ్‌లను లేఖల ద్వారా కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కల్పించే జర్నలిస్ట్ కన్సెషన్ పాస్(రాయితీ పాస్) అనేది భారతీయ రైల్వేల దీర్ఘకాలిక సంక్షేమ చర్య అని అన్నారు. భారత ప్రభుత్వం 1950ల చివరలో గుర్తింపు పొందిన జర్నలిస్టుల కోసం రైలు ప్రయాణ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, అప్పటి నుంచి ఈ విధానంలో అనేక సవరణలు, మెరుగుదలలు జరిగాయన్నారు. అక్టోబర్ 2009లో పాత కూపన్ బుక్’విధానం రద్దు చేసి. దాని స్థానంలో ’ఫోటో గుర్తింపు కార్డు’ఆధారిత రాయితీ విధానం ప్రవేశపెట్టారన్నారు. ఏప్రిల్ 2010లో గుర్తింపు పొందిన జర్నలిస్టుల జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడిన పిల్లలు, కొన్ని సందర్భాల్లో సహాయకుడికి (ఎస్కార్ట్/కాంపనియన్) కూడా ఈ రాయితీని వర్తింపజేయడం, జర్నలిస్టులు ప్రాథమిక ఛార్జీపై 50శాతం రాయితీని పొందడం కొనసాగించారన్నారు. 2016 రైల్వే బడ్జెట్‌లో జర్నలిస్ట్ కన్సెషన్ పాస్ ఉపయోగించి ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్ ఈ–టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వేలు ప్రకటించాయన్నారు. మార్చి 2020లో కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఇతర వర్గాల ప్రయాణీకులకు కల్పించిన రాయితీలతోపాటు జర్నలిస్టులకు ఇచ్చే ప్రయాణ రాయితీని కూడా భారతీయ రైల్వేలు నిలిపివేశాయన్నారు. దీనిని పునరుద్ధరించాలని రైల్వే మంత్రిత్వ శాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నానన్నారు.
ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన
జర్నలిస్టు సంఘాలు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జర్నలిస్టుల రైల్వే పాసులకు సంబంధించి ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రికి జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరుతూ చేసిన అభ్యర్థన పట్ల జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మోపురి బాలకృష్ణారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా మాజీ అధ్యక్షుడు వెన్ను శ్రీనివాస్, పులివెందుల వైఎస్సార్ క్లబ్ జర్నలిస్టులు ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


