స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : స్వాతంత్య్ర స్ఫూర్తి ఉట్టి పడేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ మల్లికార్జునుడుతో కలిసి అధికారులతో సమావేశమై 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 15 న స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ చేపట్టాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, పరేడ్‌ నిర్వహణ, ముఖ్య అతిథుల రాకపోకలు, వేదిక ఏర్పాటు, విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరం, అగ్నిమాపక, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, సాంస్కతిక కార్యక్రమాలు, విద్యార్థుల పాల్గొనడం, వివిధ శాఖల ప్రదర్శన స్టాళ్లు తదితర అంశాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమానికి విచ్చేసే విశిష్ట అతిథులకు తగిన గౌరవం కల్పించేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీ మురళి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీ భవానీ ప్రసాద్‌, సిపిఓ శ్రీ హాజరత్తయ్య, పిడి డిఆర్డిఏ డా రాజ్యలక్ష్మి, డ్వామా పిడి శ్రీ ఆదిశేషా రెడ్డి, వ్యవసాయ శాఖ జేడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఉద్యాన శాఖ అధికారి శ్రీ హరి ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్‌ కిచెన్‌ స్ఫూర్తిదాయకం

జిల్లాలో అమలవుతున్న స్మార్ట్‌ కిచెన్‌ వ్యవస్థను జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ నిపుణురాలు యుమికో ఓనిషి ప్రశంసించారు. కేవలం రుచి, శుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించడమే కాకుండా క్రమశిక్షణ, పరిశుభ్రత, సమైక్య భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందించే వినూత్న కార్యక్రమంగా ఆమె పేర్కొన్నారు. బుధవారం జపాన్‌–భారత్‌ అభివృద్ది సహకార కార్యక్రమంలో భాగంగా జైకా నిపుణులు యుమికో ఓనిషి, నీతి ఆయోగ్‌ ప్రతినిధులతో కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ కిచెన్‌ కార్యక్రమానికి అనుబంధంగా ప్రాజెక్టు ఏఎన్‌టీఎస్‌ అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 38 స్మార్ట్‌ కిచెన్ల ద్వారా 1788 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. జపాన్‌ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలనే ఆసక్తిని కలెక్టర్‌ వ్యక్తం చేశారు. ఇందుకు అవసరమైన సహకారం అందించేందుకు తాముసిద్దంగా ఉన్నామని జైకా ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జైకా సభ్యులు హితోమి హమాడ, బినయ్‌ పట్నాయక్‌, మోహిత్‌ సూద్‌, రాష్ట్రానికి చెందిన నీతి అయోగ్‌ నోడల్‌ అధికారి కార్తీక్‌రెడ్డి, డీఈఓ షంషుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement