డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి

మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథ్‌రెడ్డి

కడప సెవెన్‌రోడ్స్‌ : మెగా డీఎస్సీ–2025లో జరిగిన విచ్చలవిడి అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేసిన విధంగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్‌యాదవ్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుద, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మాజీ నగర మేయర్లు కె.సురేష్‌బాబు, పాకా సురేష్‌కుమార్‌లతో కలిసి డీఆర్వో కోసిగి మల్లికార్జునుడుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై విచారణ నిర్వహించాలని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. స్వయంగా హైకోర్టు ఆదేశించినప్పటికీ ఇంతవరకు విచారణ నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. డీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పించేందుకు రూ. 15 లక్షలు డిమాండ్‌ చేస్తున్న వీడియోలు, ఆడియో టేపులు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలన్నారు. 2025 డీఎస్సీ తక్షణమే రద్దుచేసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నియోజకవర్గాల స్థాయిలో రిలే దీక్షలు, ర్యాలీలు వంటివి చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో మెరిట్‌ లిస్టు ప్రకారం కాకుండా మనీ లిస్టు ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. యువత ధర్మ యుద్ధానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఐటీఐ, డిప్లొమా వారికి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని తెలుస్తోందన్నారు. రాష్ట్రానికి 6250 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, ఇందువల్ల 21 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పడం బూటకమని ధ్వజమెత్తారు. గండికోటలో ప్రస్తుతం 18 టీఎంసీల నీరు నిల్వ ఉందని, మైలవరానికి నీటిని విడుదల చేసి సాగులో ఉన్న పంటలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, జయచంద్రారెడ్డి, పులి సునీల్‌కుమార్‌, షఫీ, సీహెచ్‌ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement