కడప సెవెన్‌రోడ్స్ : ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు అంగన్వాడీ వర్కర్లు, స్కీమ్ వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మోకాళ్లపై నిరసన తెలియజేసి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ, స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని తెలిపారు. హెల్పర్ల ప్రమోషన్‌కి ఐదు సంవత్సరాల సీనియార్టీని రద్దు చేయాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. 32 రకాల కార్మిక వర్గం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు ఈనెల 30న నిర్వహించిన ఆందోళనలో భాగస్వాములయ్యారన్నారు. వీరంతా కనీస వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీదేవి మాట్లాడుతూ అంగన్వాడీలకు పని భారాన్ని తగ్గించాలని, నవ చేతన యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి వెంకటసుబ్బయ్య, నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, నాయకులు భైరవ ప్రసాద్, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిఎ.రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


