ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ఆ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, లంచం ఇవ్వనిదే ప్రభుత్వ అధికారులు ఏ పని చేయడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ మేరకు అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సోమవారం అమరావతిలోని పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వచ్చి ఈ వివరణ ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం.
దరఖాస్తుల ఆహ్వానం
కడప సెవెన్‌రోడ్స్ : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీ ప్రసాదరావు తెలియజేశారు. ఈ అవార్డుకు మూడు సంవత్సరాల్లో భూమి, నీరు (సముద్రం), గాలి వంటి వాటిపై చేసిన సాహస కార్యకలాపాలలో అత్యుత్తమ విజయాలు సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. సాహస క్రీడల్లో తమను తాము అంకితం చేసుకుని, నైపుణ్యము ప్రదర్శించిన వ్యక్తులకు జీవితకాల సాఫల్యం కింద ఈ అవార్డును ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. ఈ అవార్డు కోసం హెచ్‌టీటీపీఎస్//అవార్ట్స్.జీఓవీ.ఇన్ ద్వారా ఆగస్టు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
డెంగీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
కడప రూరల్ : కలిసికట్టుగా డెంగీ రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఇందిరా నగర్‌లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డీఎంహెచ్‌ఓ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు.


