పథకం ఎత్తిపోత.. సీమకు గండెకోత | - | Sakshi
Sakshi News home page

పథకం ఎత్తిపోత.. సీమకు గండెకోత

Jul 31 2026 1:39 AM | Updated on Jul 31 2026 1:39 AM

పథకం ఎత్తిపోత.. సీమకు గండెకోత

శ్రీశైలానికి భారీ వరద ప్రవాహం

865 అడుగుల నీటిమట్టం నిర్వహించాలి

ఆపైనే తెలంగాణ విద్యుత్‌ ఉత్పాదన చేపట్టేలా చూడాలి

పోతిరెడ్డిపాడు ద్వారా

‘సీమ’ ప్రాజెక్టులకు నీరివ్వాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా అల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులు నిండి పారుతున్నాయి. జూరాల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం దిగువనున్న శ్రీశైలం జలశయానికి చేరుతున్నాయి. నిన్నటిదాకా ఉన్న 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో గురువారం నాటికి లక్షా 10 వేలకు చేరుకుంది. ఈ వరద ప్రవాహం మరింత పెరిగి రెండు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 825 అడుగులు ఉంది. ఇదే ప్రవాహం మరో 10 రోజులు కొనసాగితే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలు ఉన్నాయి. సహజంగానే ఈ పరిణామం సీమ రైతుల్లో ఆశలు రెకెత్తిస్తోంది.

ఎల్‌నినో ప్రభావం

ఎల్‌నినో ప్రభావంతో జూన్‌, జులై నెలల్లో వర్షాలు అక్కడక్కడ నామమాత్రంగాను కురిశాయి. వర్షపాతలోటు అధికంగానే ఉంది. దీంతో ఖరీఫ్‌ పంటలు సాగుకు నోచుకోలేదు. ఎటుచూసినా బీడు పొలాలే దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సుండుపల్లె, వీరబల్లి, చక్రాయపేట మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. పలు గ్రామాల్లో తాగునీరు రవాణా, వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకోవడం వంటి చర్యలు జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ పరిస్థితి మరిన్ని మండలాలకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. భూగర్బ జలమట్టం క్రమేపీ తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ పరిస్థితుల్లో శ్రీశైలానికి వరద నీరు పోటెత్తడం వల్ల తాగునీరు, ఆరుతడి పంటల సాగుకు అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.

865 అడుగుల తర్వాతే విద్యుత్‌ ఉత్పాదన

1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శ్రీశైలం జలాశయం విద్యుత్‌ ఉత్పాదన చేసే ప్రాజెక్టు కాదని, బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటూ ప్రభుత్వ పరంగా ప్రకటన చేశారు. అప్పటి నుంచి శ్రీశైలం బహు ళార్థ సాధక ప్రాజెక్టుగానే కొనసాగుతోంది. తొలుత ఈ ప్రాజెక్టు నీటిని సాగు అవసరాలకే వినియోగించాలి. ఆ తర్వాతే విద్యుత్‌ ఉత్పాదన చేపట్టాలి. కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన సందర్బాల్లో తొలుత తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. వీటన్నింటి తర్వాతే పరిశ్రమలకు నీరివ్వాలని ప్రభుత్వం ప్రాధాన్యతలను నిర్ణయించింది. ఈ నేపధ్యంలో శ్రీశైలం జలాశయంలో 865 అడుగులకు నీటిమట్టం చేరే వరకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పాదన చేపట్టకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువ వద్ద విద్యుత్‌ ఉత్పాదన చేపడితే వచ్చిన నీరు వచ్చినట్లే కిందికి వెళ్లిపోతుంది. ఇందువల్ల నిత్య క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలు నెరవేరవు. అందుకే శ్రీశైలంలో 865 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించాలని, ఆపైన వచ్చే నీటిని ఆధారంగా చేసుకుని మాత్రమే విద్యుత్‌ ఉత్పాదన చేప ట్టాలని రాయలసీమ రైతాంగం కోరుతోంది. విద్యుత్‌ ఉత్పాదన ద్వారా నాగార్జున సాగర్‌కు, అదే సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా వెలుగోడు, బ్రహ్మంగారిమఠం, గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లకు నీటిని మళ్లించాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తోంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా మల్లేల ఎత్తిపోతల పథ కం ద్వారా శ్రీశైలం నీటిని హంద్రీ–నీవాకు లిఫ్ట్‌ చేస్తే కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ఈ సమయంలో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

‘సీమ’ ఎత్తిపోతలు పూర్తి చేసి ఉంటే...

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉంటే శ్రీశైలంలో 800 అడుగుల నీటిమట్టం నుంచే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు ఇప్పటికే అంది ఉండేది. కానీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న వ్యక్తిగత కక్ష కారణంగా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అటకెక్కించారు. ఎల్‌నినో లాంటి పరిస్థితులు తలెత్తినపుడు సీమ ఎత్తిపోతల పథకం ఎంతో ఉపయోగకరంగా ఉండేదని రైతులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement