● ఒకే వేదికపై శివ, కేశవుల కల్యాణం
● గోవిందనామస్మరణాలతో
మార్మోగిన తాళ్లపాక
తాళ్లపాకలో జరిగిన కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు, శివ, కేశవుల కల్యాణోత్సవంలో పాల్గొన్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలిలో శ్రీ లక్ష్మీచెన్నకేశవ, భూదేవి, శ్రీదేవిల కల్యాణం, శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువారం అన్నమాచార్య ధ్యానమందిర ఆవరణలో ఉన్న ఒక వేదికపై శివ, కేశవుల కల్యాణోత్సవం నిర్వహించడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఆర్జిత కల్యాణోత్సవానికి వందలాది భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. అనంతరం టీటీడీ వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య శివ, కేశవుల కల్యాణోత్సవం ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందనామస్మరణాలతో తాళ్లపాక మార్మోగిపోయింది. మరోవైపు అన్నమాచార్య ప్రాజెక్టులు కళాకారులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు.
కల్యాణమూర్తులను దర్శించుకున్న
రాజంపేట ఎమ్మెల్యే
కల్యాణమూర్తులను రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను టీటీడీ ఈఏవో రవి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆయన వెంట పలువురు నేతలు హాజరయ్యారు.


