● అవినీతికి కర్మ, కర్త, క్రియ ఎమ్మెల్యే వరద కుమారుడే
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: రాష్ట్రంలో ప్రొద్దుటూరు మొదలుకుని ఇచ్ఛాపురం వరకు తెలుగుదేశం పార్టీ నేతల అండదండల వల్లే అవినీతి, అక్రమాలు మిన్నంటాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అధికారులపై చేసిన విమర్శల వీడియోను ఆయన ప్రదర్శించారు. కూటమి నేతల ప్రత్యక్ష ప్రమేయం, ఒత్తిళ్ల వల్లే అధికారులు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారని, శాంతిభద్రతల వైఫల్యానికి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనానికి కర్మ, కర్త, క్రియ ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి అని రాచమల్లు తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పులన్నీ ఇంట్లో పెట్టుకుని అధికారులను బాధ్యులను చేయడం తగదన్నారు. చౌడూరు ఇసుక రీచ్ నుంచి సాగుతున్న అక్రమ ఇసుక రవాణా ద్వారా కొండారెడ్డి రోజుకు ఏకంగా రూ.25 లక్షలు ఆర్జిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. పీఎన్ఆర్ కాంప్లెక్స్‌కు సంబంధించిన 4.36 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయడానికి వచ్చిన తిరుపతి వ్యాపారులను కేవలం భారీ వాటా ఇవ్వలేదనే కారణంతో కొండారెడ్డి బెదిరించి వెనక్కి పంపారని ఆరోపించారు. మార్కెట్‌యార్డులో శనగల కొనుగోలు అక్రమాల్లో పూజ చైర్మన్‌ది అయితే, తీర్థప్రసాదాలన్నీ కొండారెడ్డికే అందుతున్నాయన్నారు. చౌక డిపోలకు చేరాల్సిన రేషన్ బియ్యం గోడౌన్ల నుంచే బ్లాక్ మార్కెట్‌కు తరలిపోవడంలో ప్రధాన వాటా ఆయనదేనన్నారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన ఒక పెద్ద క్రికెట్ బుకీని స్టేషన్ నుంచి కొండారెడ్డి ఒత్తిడి తెచ్చి తప్పించాడని, కేవలం ధనార్జన కోసమే క్రికెట్ బుకీలైన కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో తాము మూసివేయించిన జార్జ్ క్లబ్‌ను మళ్లీ తెరిపించి, ఇంజినీరింగ్ ఫీజు కంటే ఎక్కువగా రూ.1.20 లక్షలు మెంబర్షిప్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ కొండారెడ్డే చేస్తున్నాడని, నాసిరకంగా నిర్మించిన పొట్టిపాడు రోడ్డుకు 1868 పగుళ్లు ఏర్పడినా చర్యలు లేవన్నారు. బొల్లవరంలోని మహర్షి స్కూల్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ అధికారులను బెదిరించి రాయించుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు తిరుగుబాటు చేయాల్సింది నిరుపేదల పొట్టగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపైన, కూటమి ఎమ్మెల్యేలపైన మాత్రమేనన్నారు. పాలకులే అడ్డగోలు దోపిడీలకు తెరలేపి, చివరకు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులపై నిందలు వేస్తున్నారన్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ ‘పార్టీ నుంచి వెళ్లడానికి గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి‘ అని అనడంతో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మానసిక ప్రశాంతత కోల్పోయి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎద్దేవా చేశారు.


