వరదకు అడ్డుకట్ట ! | - | Sakshi
Sakshi News home page

వరదకు అడ్డుకట్ట !

Jul 16 2026 5:12 AM | Updated on Jul 16 2026 5:12 AM

●వరద.. మంత్రి సవిత ఎడమొహం పెడమొహం ఎమ్మెల్యే వర్గానికి లోకేష్‌ హెచ్చరికనా ?

ప్రవీణ్‌ రెడ్డి వర్గాన్ని కలుపుకెళ్లాలని ఎమ్మెల్యేకు హితబోధ చేసిన లోకేష్‌

కాదంటే తలుపులు ఓపెన్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరిక

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ విసిగిపోయారా? స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రాభవానికి అడ్డుకట్ట వేయనున్నారా?.. అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రొద్దుటూరులో బుధవారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ పలికిన మాటలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రొద్దుటూరు టీడీపీలో మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మధ్య కొన్నేళ్లుగా వర్గ పోరు నడుస్తోంది. వీరి విభేదాలు ఇటీవల పతాకస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులోని బైపాస్‌ రోడ్డులో బుధవారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేష్‌ వీరి విభేదాలపై స్పందించారు. ‘పార్టీలో అందరినీ కలుపుకొని పోవాల్సిందే ఎమ్మెల్యే గారు.. మీరు కలుపుకోలేని పక్షంలో నేను తలుపులు ఓపెన్‌ చేయాల్సి వస్తుంది’ అంటూ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగానే లోకేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఎస్‌ఎస్‌మాల్‌ వ్యవహారంలో ఇటీవల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వర్గీయులు పరస్పర దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనే ఎమ్మెల్యే కుమారుడు నంద్యాల కొండారెడ్డి, ఆయన అనుచరులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో లోకేష్‌ మాట్లాడటం చర్చకు దారి తీస్తోంది.

ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పక్కన పెట్టి పార్టీని నడిపించాలనే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదనే సంకేతాన్ని మంత్రి లోకేష్‌ ఇచ్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల బద్వేల్‌ టీడీపీలో గ్రూపు రాజకీయాలకు చెక్‌ పెట్టి సూర్యనారాయణరెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన లోకేష్‌.. ప్రొద్దుటూరు విషయంలోనూ అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటాననే సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రవీణ్‌ వర్గానికి నో ఎంట్రీ

కార్యకర్తల సమావేశం వేదిక వద్ద చోటు చేసుకున్న పరిణామాలు ఇరువర్గాల మధ్య విభేదాలకు అద్దం పట్టాయి. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్లు రావడంతో వందలాది మంది కార్యకర్తలు సమావేశానికి తరలివచ్చారు. వీరిలో అనేక మందిని లోపలికి అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలను మీటింగ్‌ హాల్లోకి అనుమతించలేదు. కాగా వరదరాజుల రెడ్డితో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేక ప్రవీణ్‌ కూడా కార్యకర్తలతో కలిసి బయటే ఉండిపోయారు. మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి వర్గానికి చెందిన పలువురికి కూడా ఇదే పరిస్థితి ఎదురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హైస్కూల్‌ను తనిఖీ చేసిన మంత్రి

కాగా మంత్రి లోకేష్‌ ముందుగా దొరసానిపల్లె జెడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. అనంతరం వైఎంఆర్‌ కాలనీలోని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టాసుధాకర్‌యాదవ్‌ ఇంటికి వెళ్లారు. ఇటీవల పుట్టాసుధాకర్‌ యాదవ్‌ తల్లి మృతి చెందారు. దీంతో లోకేష్‌ వారింటికి వెళ్లి ఎమ్మెల్యే పుట్టా కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి సవిత, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిల మధ్య దూరం కూడా కార్యకర్తల్లో చర్చకు దారి తీసింది. గంటన్నర పాటు వేదికపై ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకరినొకరు పలుకరించుకోలేదని, ఎడమొహం పెడమొహంగా ఉన్నారని కార్యకర్తలు చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement