● అక్రమదారులకు జీ హుజూర్ అంటున్న అధికారులు
● దువ్వూరులో రోడ్డును మింగేసిన
తెలుగు తమ్ముడి అక్రమ నిర్మాణం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అధికార పార్టీ అండ ఉంటే చాలు ప్రభుత్వ నిబంధనలు చుట్టాలుగా మారిపోతాయి. ప్రభుత్వ భూములు సొంత ఆస్తులుగా రూపాంతరం చెందుతాయనడానికి మండల కేంద్రమైన దువ్వూరులో జరుగుతున్న ఈ ఘటనే సజీవ సాక్ష్యం. మండల కేంద్రంలోని సీవీవీ కల్యాణ మండపం పక్కన ప్రభుత్వ రస్తాను, ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఓ టీడీపీ నాయకుడు యథేచ్ఛగా నూతన గదులను నిర్మిస్తున్నాడు. దువ్వూరు రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 462/1లో అసైన్‌డ్ ల్యాండ్ 62 సెంట్లు ఉంది. ఈ భూమి బాణాల విశ్వజ్ఞ ఆచార్య పేరుతో అడంగల్‌లో నమోదై ఉంది. భూమిలేని పేద ప్రజలకు ప్రభు త్వం అసైన్‌డ్ భూములను కేటాయిస్తుంది. కానీ విశ్వజ్ఞ ఆచార్య అనే అతను పుల్లారెడ్డిపేటలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తూ నెలకు దాదాపు రూ.2లక్షలు ప్రభు త్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు విశ్వజ్ఞ ఆచార్య దగ్గర తాను కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నాడు. దువ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ సర్వే నంబర్‌కు సంబంధించి 1995 నుంచి 2026 జూన్ వరకు ఈ 31 ఏళ్లలో ఎక్కడా అమ్మకం, కొనుగోలు లావాదేవీలు జరగలేదు. తమకు హక్కు ఉందని ఈ స్థలాన్ని కై వసం చేసుకున్న టీడీపీ నేత రెవెన్యూ కార్యాలయంలోని అధికారులతో 2023లో ఈ భూమిని అసైన్‌డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ రికార్డులు సృష్టించాడు. గత సోమవారం ఆర్‌అండ్‌బీ రెవెన్యూ అధికారులు దువ్వూ రు పాత జాతీయ రహదారి, మెయిన్ రోడ్డు ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన అధికారులు ఈ అక్రమ కట్టడాలను చూసి నోరు మెదపడం లేదంటే ఆ నాయకుడంటే భయమా? లేక అతనితో లాలూచి పడ్డారా అనే చర్చ జరుగుతోంది. వందేళ్ల కిందట రెవెన్యూ రికార్డు ఆర్‌ఎస్‌ఆర్‌లో రస్తా అనే నమోదైంది.గ్రామంలోని కొంత మంది పెద్దలు దీనిని ఉదయగిరి రస్తా అంటున్నారు. ఎవరైతే మాకేంటి మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిందే చట్టం అంటూ రోడ్డును ఆక్రమించి రస్తాను, పొలాలకు వెళ్లే కాలువను పూడ్చి వేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కడో ఉన్న వ్యక్తికి ఈ స్థలంపై హక్కు ఉందంటూ ఏకంగా పక్కనున్న స్థలానికి గోడ కట్టి అక్రమంగా రూములు నిర్మిస్తుండటం స్థానికంగా దుమారం రేపుతోంది. అధికారులు ఆ నేతకు అనుకూలంగా రికార్డులు మార్చేశారు. నిర్మాణానికి రూట్ క్లియర్ చేశారు. ఆర్‌ఎస్‌ఆర్ రికార్డులో స్పష్టంగా రస్తా అని ఉన్నా రాత్రికి రాత్రే అసైన్‌డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అని మార్చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు పోలీస్‌స్టేషన్ నుంచి మురుగునీటి కాలువలు, రోడ్డు ఆక్రమణపై సర్వే నిర్వహించారు. సర్వే చేస్తున్న ప్రాంతానికి పక్కనే ఉన్న ఈ అక్రమ నిర్మాణం అధికారుల కళ్లకు కనిపించకపోవడం గమనార్హం. సదరు టీడీపీ నాయకుడి ప్రాబల్యానికి లొంగిపోయిన అధికారులు అక్రమ నిర్మాణాల వద్ద మార్కింగ్ వేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వ రస్తా, స్థలాన్ని, కాలువను పూడ్చి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు ఆపి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


