● రూ. 1.03 కోట్లతో దేవునికడప
ఆలయ అభివృద్ధి పనులు
● ఆగస్టు నాటికి పూర్తయ్యేలా లక్ష్యం
కడప సిటీ : తిరుమల తొలిగడపగా ప్రసిద్ధి చెందిన దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సున్నం కొట్టిన స్తంభాలను గ్రైండింగ్ చేసి ప్రాచీన కళ ఉట్టిపడేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమున్నచోట రాగి రంగులో ఉన్న గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గోడలు నెర్రెలు చీలిన చోట్ల అతి జాగ్రత్తగా వాటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నింటికిగాను దాదాపు రూ. 1.03 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టీటీడీ ఏఈ కళావతి వెల్లడించారు. జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం బాలాలయంలోనే స్వామి,
అమ్మవార్ల దర్శనం
గతేడాది ఆగస్టు 19వ తేది నుంచి ప్రారంభమైన ఆలయ మరమ్మతు పనులు వచ్చే నెల ఆగస్టు కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్వామి, అమ్మవార్లను బాలాలయంలోనే పూజా కార్యక్రమా లు నిర్వహిస్తున్నామని.. భక్తులకు అక్కడి నుంచే దర్శనభాగ్యం కల్పిస్తున్నామని తెలిపారు.
ఆగష్టు 23 నుంచి సంప్రోక్షణకు ఏర్పాట్లు
వీలైనంత మేర మరమ్మత్తు పనులను వేగవంతం చేసి ఆగస్టు 23 నుంచి 26వ తేది వరకు మూడు రోజులపాటు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. అప్పటి నుంచి మూల విరాట్ దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. కాగా ప్రస్తుత బాలాలయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుందని వివరించారు.
బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
ఆలయ ఆవరణలో మరమ్మతు పనులనుపరిశీలిస్తున్న ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి


