విద్యాశాఖ.. వింతపోకడ | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ.. వింతపోకడ

Mar 4 2026 7:39 AM | Updated on Mar 4 2026 7:39 AM

జిల్లా స్థాయి అధికారి ప్రాధాన్యత లేకుండా...

జిలా విద్యాశాఖను డమ్మీ చేయడమే

పొరపాటును సవరించాలి

విజయవాడ నుంచి నేరుగా టెన్త్‌

ఇన్విజిలేషన్‌ విధులు కేటాయింపు

ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు

అతీతంగా విధులు

దూర ప్రాంతాల్లో నియమించే అవకాశం

ఆందోళనలో ఉపాధ్యాయులు

కడప ఎడ్యుకేషన్‌: విద్యాశాఖలో వింతపోకడ రాజ్యమేలుతోంది.చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపాధ్యాయులపై అదనపు భారాలు మోపుతోంది. తాజాగా పదోతరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్‌ బాధ్యతల విషయంలో వింత నిర్ణయం తీసుకుంది. ఏటా పదో తరగతి ఇన్విజిలేషన్‌ బాద్యతలు జిల్లాస్థాయిలో విద్యాశాఖ అధికారుల ద్వారా చేపట్టడం పరిపాటి. ఈ సారి అలా కాకుండా ఆటోమేషన్‌ విధానంతో రాష్ట్రస్థాయి నుంచి ఇన్విజిలేషన్‌ నియామకాలు జరపాలని నిశ్చయించింది.ప్రభుత్వ నిర్ణయం అయ్యోర్లను ఆందోళనకు గురి చేస్తోంది.ఆటో మేషన్‌ ద్వారా ఇన్విజిలేషన్‌ విధులు కేటాయిస్తే దీర్ఘ అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారికి సైతం ఇన్విజిలేషన్‌ బాధ్యతలు పడే అవకాశాలు ఉంటాయి.అలాగే సుదూర ప్రాంతాల్లో ఇన్విజిలేషన్‌ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి విధానం పూర్తి అసంబద్ధమని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు అంటున్నారు. దీనిపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

దశాబ్దాలుగా పదోతరగతి పరీక్షలకు సంబంధించి ఆయా జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో ఉపాధ్యాయుల సీనియారిటీ ఆధారంగా విధులు కేటాయిస్తున్నారు. అయితే ఈ ఏడాది కొత్తగా డీఈఓకు డ్యూటీ కేటాయింపుతో సంబంధం లేకుండా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు విజయవాడ కమిషనర్‌ కార్యాలయం నుంచే కేటాయింపునకు శ్రీకారం చుట్టారు. లీప్‌యాప్‌ ద్వారా డిజిటల్‌ పద్ధతిలో ఉపాధ్యాయులకు రాష్ట్రవ్యాప్తంగా విధుల విభజన చేపట్టారు. అలాగే సీఎస్‌లు, డీఓగా, ఏడీఓగా డ్యూటీల కేటాయింపులు చేసుకున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌(సీఎస్‌) పర్యవేక్షణలో పది పరీక్ష కేంద్రాల నిర్వహణ ఉంటుంది. తర్వాత డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు(డీఓలు)గా సీనియర్లు అయిన స్కూల్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ డిపార్టుమెంట్‌ ఆపీసర్లుగా(ఏడీఓ) జూనియర్లగా ఉంటున్న స్కూల్‌ అసిస్టెంట్లకు విధుల కేటాయింపు దశాబ్దాలుగా చేస్తున్నారు. డీఓగా పనిచేసిన అనుభవం ఉన్న హెచ్‌ఎంకే సీఎస్‌ డ్యూటీలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

పరీక్ష నిర్వహణలో కీలకపాత్ర..

పరీక్ష నిర్వహణలో చీఫ్‌, డీఓలదే కీలకపాత్ర. పరీక్ష కేంద్రంలో సమగ్ర ఏర్పాట్లు చేసుకోవడం, పరీక్షలు జరిగే రోజుల్లో విద్యాశాఖ రోజువారీ నిర్వహించే సెట్‌ కాన్ఫరెన్స్‌కు హాజరుకావడం, ఉన్నతాధికారులిచ్చే సూచనలు, ఆదేశాల అమలుకు కేంద్రంలో ఏర్పాట్లు చేసుకోవడం, ముఖ్యంగా పరీక్ష ప్రారంభ సమయానికి ముందుగా సంబంధిత పోలీసుస్టేషన్లకు వెళ్లి ప్రశ్నపత్రాల బండిళ్లను పరీక్ష కేంద్రానికి భద్రంగా తీసుకురావడంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం, పరీక్ష నిర్వహణ సిబ్బంది అయిన ఇన్విజిలేటర్ల నుంచి వివరాలు తీసుకోవడం, మిగతా శాఖలైన పోలీసు, వైద్యఆరోగ్యశాఖ, శానిటేషన్‌, మున్సిపల్‌/పంచాయతీరాజ్‌ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, సమన్వయం చేసుకోవడం తదితర విధులు చూసుకోవాల్సి ఉంటుంది.

● పరీక్ష కేంద్రానికి మిగతా సిబ్బంది కంటే ముందుగా సీఎస్‌, డీఓలే చేరుకోవాలి. పరీక్ష ముగిసిన తర్వాత జవాబుపత్రాలను పోస్టాఫీసులో పార్శిల్‌ చేసే వరకు వీరిద్దరూ ఒకరికొకరు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 6 నుంచి 7 గంటల్లోగా కేంద్రానికి చేరుకోవాలి. ఇన్ని కీలక బాధ్యతలున్న సీఎస్‌, డీఓలను సాధారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న స్కూలు ప్రాంతం నుంచి గరిష్టంగా 30 కిలోమీటర్ల దూరానికి లోబడి నియమిస్తుంటారు. దీనికి భిన్నంగా విద్యాశాఖ ఈ ఏడాది నుంచి టెన్త్‌ పరీక్షల సిబ్బందికి విధుల కేటాయింపునకు ప్రవేశపెట్టిన ఆటోమేషన్‌ విధానం పూర్తిగా మార్చివేసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తనవద్ద ఉన్న టీచర్ల సమాచారం (టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం–టిస్‌) ఆధారంగా జిల్లా విద్యాశాఖతో సంబంధం లేకుండా, క్షేత్రస్థాయిలో దూరాభారంతో నిమిత్తం లేకుండా అపాయింట్మెంట్‌ ఆర్డర్లు జారీ చేయడంతో నిరసనలు తలెత్తాయి.

విద్యాశాఖలో డీఈవో, ఎంఈఓలు తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా కమిషనరేట్‌ నుంచే తీసుకుంటున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇంతవరకు పది విధులపై ఎలాంటి అవగాహన లేని వారికి ఆర్డర్స్‌ ఇవ్వడం, కొన్నిచోట్ల సీనియర్లను విస్మరించి జూనియర్లకు డ్యూటీలు వేయడం మంచిదికాదు. అనారోగ్య కారణాలతో బాధపడే వారికి డ్యూటీలు కేటాయించడం సహేతుకం కాదు.

– నర్రెడ్డి సంగమేశ్వర్‌ రెడ్డి, ఎస్టీయూ, కడప జిల్లా అధ్యక్షుడు

పదోతరగతి పరీక్షలలో సీఎస్‌, డీఓ, ఇన్విజిలెటర్స్‌ డ్యూటీలు కమిషనర్‌ కార్యాలయం నుంచి కేటాయించడమంటే డీఈఓ, డిప్యూటీఈఓ, ఎంఈఓలను డమ్మీలుగా చేయడమే. వారికి ఆ జిల్లాలపై పట్టు ఉంటుంది. పరీక్షలు ఎలా జరపాలో అనుభవం ఉంటుంది. అలాంటిది వారికి సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించడం అంటే నేలవిడిచి కత్తి సాము చేయడమే. జిల్లా విద్యాశాఖ అధికారులపై నమ్మకం లేకనే ఈ విధంగా ఉత్తర్వులు ఇస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికై నా ఎవరు చేయాల్సిన పని వారితో చేయిస్తే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. – లెక్కల జమాల్‌ రెడ్డి, పీఎస్‌టీయూ, రాష్ట్ర అధ్యక్షులు,

పది పరీక్షలకు రాష్ట్రస్థాయి నుంచి కేటాయించిన డ్యూటీల్లో పారదర్శకత కనిపించడం లేదు. జూనియర్‌ ఉపాధ్యాయులకు సీఎస్‌ ఇచ్చారు. సీనియర్‌లకు డీఓలు, ఏడీఓలుగా ఇవ్వడం సరికాదు, రాష్ట్ర కమిషనర్‌ ఆధ్వర్యంలో డ్యూటీ కేటాయింపులో తికమకలు చోటు చేసుకున్నాయి. పొరపాటును సవరించాలి.

– అమర్‌నాథరెడ్డి, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement