అంగన్వాడీల అక్రమ అరెస్టులపై పలుచోట్ల నిరసనలు | - | Sakshi
Sakshi News home page

అంగన్వాడీల అక్రమ అరెస్టులపై పలుచోట్ల నిరసనలు

Mar 4 2026 7:39 AM | Updated on Mar 4 2026 7:39 AM

అంగన్వాడీల అక్రమ అరెస్టులపై పలుచోట్ల నిరసనలు

కడప సెవెన్‌రోడ్స్‌ : అంగన్వాడీలపై నిర్బంధం, అరెస్టులకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిరసనలు హోరెత్తాయి. ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో అంగన్వాడీలు నిరసన వ్యక్తంచేశారు. కమలాపురంలో అంగన్వాడీల రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు మంజుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తన హామిని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగేశ్వరరావుతోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద

కలెక్టరేట్‌ ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఛలో విజయవాడ సందర్బంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అంగన్వాడీలపై పాల్పడిన దమనకాండను తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు మునుపు ఇచ్చిన హామిలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా? అంటూ అంగన్వాడీలు మండిపడ్డారు. వేతనాలు పెంచకుండా ప్రభుత్వం తమ గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వేణుగోపాల్‌, కేసీ బాదుల్లా, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులురెడ్డి, మనోహర్‌లు మాట్లాడుతూ వేతనాల పెంపుపై ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామిలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు, జీవన వ్యయం పెరిగిపోతోందని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలన్నారు. యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ పనిభారాన్ని తగ్గించి రిజిష్టర్ల నిర్వహణను సరళతరం చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ సందర్బంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలన్నారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగించాలన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ప్రభుత్వం నిర్బంధ కాండకు ఒడిగట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం మెడలు వంచి తమ డిమాండ్లను సాధించుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా దిగి రాకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ది చెబుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement