చాపాడు : మండలంలోని తిప్పిరెడ్డిపల్లెలోని దళితవాడకు వెళ్లే రహదారిలోని సిమెంట్ రోడ్డును పగలగొట్టి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు మళ్లీ నిర్మించలేదు. దీంతో రహదారి మొత్తం నీరు, బురదతో నిండిపోయి దళిత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం దళిత వాడ మహిళలు, విద్యార్థులు రోడ్డుపై బురదలో మోకాళ్లపై కూర్చొని తమకు దారి చూపించండి సార్ అంటూ నిరసన తెలిపారు. తమ కాలనీలోకి అంబులెన్స్ రావాలన్నా.. దారి లేదని, గ్రామంలో ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా సరైన దారి లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని నిర్మించాలని కోరారు.


