న్యూ ఇయర్‌కు గండికోట ముస్తాబు
● భారీగా పర్యాటకులు తరలివచ్చే అవకాశం
● ఇప్పటికే గదులన్నీ ఫుల్
● టెంట్‌లకు గిరాకీ
జమ్మలమడుగు : నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పర్యాటక కేంద్రమైన గండికోటకు భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇటీవల పర్యాటక కేంద్రంగా గండికోటకు మంచి గుర్తింపు వచ్చింది. గ్రాండ్ కెన్యాన్‌గా ప్రపంచ గుర్తింపు పొందిన పెన్నానది లోయ అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు భారీగా వస్తున్నారు. గండికోటలో జనవరి వేడుకలను నిర్వహించునేందుకు ఇప్పటికే బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ తదితర ప్రాంతాలనుంచి భారీగా పర్యాటకులు రూములు బుక్ చేసుకుంటున్నారు. హరితా హోటల్‌తోపాటు ప్రైవేట్ రిసార్టులలో ఉన్న రూములన్నీ పూర్తిగా భర్తీ కావడంతో టెంట్‌లపై దృష్టి సారిస్తున్నారు.
ప్రమాదకరంగా మారుతున్న టెంట్లు..
నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా గండికోటలో పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో రిసార్టు యజమానులు, టెంట్ నిర్వాహకులు పర్యాటకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.3వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉండే పెన్నానది కొండ సమీపంలోనే టెంట్లు వేస్తున్నారు. రాత్రిపూట విష పురుగులు ఎక్కువగా సంచరిస్తున్నా వారికి ఎలాంటి ప్రమాదాలు జరిగినా తమకు సంబంధం ఉండదంటూ వారు బాహాటంగానే చెబుతున్నారు. నూతన సంవత్సరంలో గండికోటలో మందు బాబుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి వేడుకల్లో అపశ్రుతులు జరిగే ప్రమాదం ఉందని, పోలీసులు రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


