గండికోట వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: గండికోట చారిత్రక, పర్యాటక సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా ‘గండికోట ఉత్సవాల‘ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండి కోట ఉత్సవాల ఏర్పాట్లు, పనులపై కలెక్టర్ జిల్లా పర్యాటక శాఖ, ఏపీ టీడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గండికోట పర్యాటక ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టే అన్ని రకాల పనులకు సంబంధించిన నిర్వహణ పనులను, మ్యాపులను, డిజైన్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గండికోట పర్యాటక కేంద్రంలో సుసంపన్నమైన కోట, గార్జ్ అనుభవాన్ని పర్యాటకుల సొంతం చేసే దిశగా.. జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. 2026 జనవరి 11, 12, 13 తేదీల్లో జరగనున్న గండికోట పర్యాటక ఉత్సవాలను జిల్లా పర్యాటక, చారిత్ర, సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా దేశం నలు దిక్కులా చాటేలా కొన్ని ప్రధానమైన పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతోందన్నారు. ఉత్సవాలకు ముందు పూర్తి కావాల్సిన పలు ముఖ్య మైన పనులను పరిశీలించి..ఎంట్రన్స్, వెలివేషన్, పార్కింగ్, అమినిటీ భవనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లను ఆదేశించారు. గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. అంతకుముందు వీసీ ద్వారా పర్యాటక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో కలెక్టర్ ద్వారా సమీక్షించారు. జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, ఏపీ టీడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, డీఈ పెంచలయ్య, పీఆర్ ఎస్‌ఈ మద్దన్న, జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
జనవరి 11 నుంచి గండికోట ఉత్సవాల నిర్వహణ


