రేనాటి ముద్దుబిడ్డ బుడ్డా
కడప సెవెన్‌రోడ్స్: ఒకరా ఇద్దరా.. ఊళ్లకు ఊళ్లు కరువు బారిన పడి ప్రజలంతా మృత్యుముఖంలోకి జారుతున్న విషాద సమయంలో ఆయన అక్కున చేర్చుకున్నారు. తన ఆస్తులన్నీ ధాన్యంగా మార్చి సాటి మనుషుల ప్రాణాలు నిలిపి చరిత్రలో మహనీయుడిగా నిలిచిపోయారు. అన్నార్థుల పాలిట ఆత్మబంధువుగా ఖ్యాతిగడించారు. ఆయనే రేనాటి ముద్దుబిడ్డ.. బుడ్డా వెంగళరెడ్డి. బుధవారం బుడ్డా వెంగళరెడ్డి 125వ వర్ధంతి. ఆయన సేవలను స్మరించుకుంటూ రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే వర్ధంతి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.హరీంద్రనాథ్, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోపూరి బాలకృష్ణారెడ్డి, నిర్వాహకులు దండా ప్రసాద్, ఇంటాక్, రెడ్డి సేవాసమితి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య తదితర సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు.
‘బుడ్డా’గురించి...
ఒకప్పటి కడప జిల్లా కోయిలకుంట్ల తాలూకా ఉయ్యాలవాడ గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో బుడ్డా వెంగళరెడ్డి జన్మించారు. దానధర్మాలు, ధార్మిక చింతన వంటివి చిన్నతనం నుంచే అలవడ్డాయి. 1866 నాటి భయానక కరువులో ఇతర జిల్లాల నుంచి శరణార్థులైవచ్చిన వేలాది మందికి అంబలిపోసి ఆకలి తీర్చడం ద్వారా ప్రాణాలు నిలిపారు. ఈ విషయం తెలుసుకుని వెంగళరెడ్డిని మద్రాసుకు ఆహ్వానించి విక్టోరియా మహారాణి బంగారు పతకం అందజేసి గౌరవించారు.
నేడు 125వ వర్ధంతి


