టీచర్ కొట్టిందని తల్లిదండ్రుల ఆందోళన
బద్వేలు అర్బన్ : తమ కుమార్తెను ఉపాధ్యాయురాలు నిష్కారణంగా కొట్టిందని ఆరోపిస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే సెలవులకు ఊరికి వెళ్లి ఆలస్యంగా వచ్చిందని మందలించామని, కొట్టలేదని ఉపాధ్యాయురాలు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అట్లూరు మండలం బాలిరెడ్డిబావి గ్రామానికి చెందిన నరసింహులు, ఆదిలక్షుమ్మల కుమార్తె కోటపాటి అరుణ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. క్రిస్మస్ సెలవులకు ఈ నెల 24న ఊరికి వెళ్లిన అరుణ సోమవారం పాఠశాలకు వచ్చింది. ఈ సమయంలో పాఠశాల ఉపాధ్యాయురాలు రమణమ్మ తమ కుమార్తెను కొట్టిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలిని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. తోటి ఉపాధ్యాయులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. అయితే శనివారమే పాఠశాలకు రావాల్సి ఉండగా ఎందుకు ఆలస్యం చేశావని, పరీక్షలు దగ్గరపడుతున్నాయి కదా అని గట్టిగా మందలించామే తప్ప కొట్టలేదని, శనివారం నుండి విద్యార్థిని తల్లిదండ్రులకు పాఠశాలకు పంపమని ఫోన్ చేస్తున్నా స్పందించకుండా వెటకారంగా మాట్లాడారని ఉపాధ్యాయురాలు రమణమ్మ తెలిపారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ భానుమతిని సంప్రదించగా సెలవులు అయిపోయినప్పటికీ పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయురాలు గట్టిగా మందలించారని తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు.


