ఆలోచించండి.. విజ్ఞతతో తీర్పు ఇవ్వండి ! | - | Sakshi
Sakshi News home page

ఆలోచించండి.. విజ్ఞతతో తీర్పు ఇవ్వండి !

Aug 12 2025 8:00 AM | Updated on Aug 12 2025 8:52 AM

-

 అభివృద్ధికి వైఎస్‌ కుటుంబం చిరునామా

 వారిని కాదని పక్కవారిని ఎందుకు బలపర్చాలి?

 ఆలోచించండి.. విజ్ఞత ప్రదర్శించండి.. పులివెందుల పౌరుషాన్ని చాటిచెప్పండి

సోషల్‌ మీడియాలో మేధావుల ఫోరం బహిరంగ లేఖ వైరల్‌

సాక్షి ప్రతినిధి, కడప : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం వెలుగుచూసింది. మేధావుల ఫోరం, పులివెందుల పేరిట ‘ఆలోచించండి.. విజ్ఞతతో తీర్పు ఇవ్వండి’.. అంటూ ఓ బహిరంగ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అసలు టీడీపీకి ఓటెందుకు వేయాలి? అని ప్రశ్నించడంతో పాటు.. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన అనేక అభివృద్ధి అంశాలను అందులో ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లేఖ పూర్తిపాఠం ఇలా ఉంది..

● పులివెందుల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఏం చేశారు? ఏం చూసి ఓట్లు వేయాలి? కసనూరు సంస్కృతి (ఫ్యాక్షన్‌ తరహా రాజకీయాలు) తెరపైకి తెచ్చి భయానక పరిస్థితులు కల్పించినందుకా? .. ప్రశాంత పట్టణంలో విచ్చలవిడి దౌర్జన్యం చేస్తున్నందుకు ఓటెయ్యాలా?.. కోనసీమను మరిపించేలా పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంతో ఉన్న పచ్చటి గ్రామాల్లో రక్తపాతం పారిస్తున్నందుకు ఓటెయ్యాలా?.. ఓ సారి ఆలోచించండి. కామధేనువు లాంటి వైఎస్‌ కుటుంబాన్ని కాదని పక్కవారిని ఎందుకు బలపర్చాలి? పులివెందుల మండల ప్రజలు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. అభివృద్ధికి వైఎస్‌ కుటుంబం చిరునామా. ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునేందుకు మాత్రమే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పరిమితం. నిర్దిష్టమైన అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటీ లేదు. పులివెందుల అభివృద్ధంటూ జరిగిందంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మాత్రమే. ఈ విషయం మీకు తెలియంది కాదు. కళ్లెదుట కన్పిస్తోంది. ఉదాహరణకు..

⇒ విద్యాపరంగా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, నాడు–నేడు పథకంలో అపురూపంగా మారిన పాఠశాలలు.

⇒ ఆరోగ్య రంగంలో డాక్టర్‌ వైఎస్సార్‌ మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, ఉపాధి రంగంలో యూసీఐఎల్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్‌, గోవిందరాజా టెక్స్‌టైల్స్‌, వ్యవసాయ రంగంలో చీనీ మార్కెట్‌ యార్డు, బనానా రీసెర్చ్‌ సెంటర్‌, ఐజీసీఏఆర్‌ఎల్‌ (ఐజీ కార్ల్‌), డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ గుర్తుకొస్తాయి. ఒక ప్రాంతంలో ఇన్ని సంస్థలు రావడం సాధ్యమా? వైఎస్‌ కుటుంబం చలువే కదా ఇదంతా.

⇒ కృష్ణా జలాలను మెట్ట ప్రాంతంలో పారించాలనే తపన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిది. అందుకే గండికోట రిజర్వాయర్‌ నుంచి నీరు లిఫ్ట్‌ చేసి, పైడిపాలెం రిజర్వాయర్‌లో నిల్వచేసే బృహత్తర ప్రాజెక్టు తీసుకొచ్చారు.

⇒ మూడు టీఎంసీలకు మాత్రమే పరిమితమైన ఛిత్రావతి ప్రాజెక్టును 10 టీఎంసీలకు విస్తరించారు. గండికోట నుంచి చిత్రావతి లిఫ్ట్‌ ద్వారా నీరు తీసుకొచ్చారు. కుడి, ఎడమ కాలువలు తవ్వారు.

⇒ అద్భుతమైన రోడ్డు కనెక్టవిటీ సౌకర్యం కల్పించారు. బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఔటర్‌ రింగ్‌ రోడ్లు, విలేజ్‌ కనెక్టివిటీ రోడ్లు, సచివాలయాలు, వరల్డ్‌ క్లాస్‌ ఆర్టీసీ బస్టాండ్‌, క్రికెట్‌ స్టేడియం, మినీ సెక్రటేరియట్‌ ఉలిమెల్ల లేక్‌వ్యూ, రాణి తోపుల ఇవన్నీ వైఎస్‌ కుటుంబం తీసుకొచ్చినవే కదా!

టీడీపీ గెలుపు ఎవరికి ప్రయోజనం..?
ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఎవరికి ప్రయోజనం? ప్రధానంగా బీటెక్‌ రవికి, పరోక్షంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఇద్దరూ కలిసి కుట్రలు, కుతంత్రాలకు దిగుతున్నారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలింగ్‌లో దొమ్మి చేయాలని చూస్తున్నారు. పోనీ, ఆ తర్వాత కూడా ఇలాగే ఉంటారా? 2019లో అధికారంలోకి వైఎస్సార్‌సీపీ రాగానే రూ.10 కోట్లు ఇస్తాం, పార్టీలో చేర్చుకోండంటూ పాదాక్రాంతమయ్యారు. ఇదంతా వాస్తవమే కదా!

జగన్‌ను ఓడించామని చెప్పుకునేందుకే..
పులివెందులలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించామని చెప్పుకునేందుకే.. నానా తంటాలు పడుతున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవస్థలు మిన్నకుండిపోయాయి. టీడీపీ పెద్దలు చంద్రబాబు, లోకేశ్‌ మెప్పు కోసమే ఈ యాగీ అంతా. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌్‌ఎంసీ) 2024–25 విద్యా సంవత్సరంలోనే పులివెందులకు 50 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరు చేసింది. నిర్దయగా వద్దని చంద్రబాబు సర్కారు లేఖ రాసింది. జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అనుసంధానం ప్రాజెక్టును మరుగునపర్చారు. ఎలాంటి పురోగతిలేదు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఆలోచించండి.. విజ్ఞత ప్రదర్శించండి. నిర్భయంగా మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోండి. పులివెందుల పౌరుషాన్ని తెలియజేయండి.|
– మేధావుల ఫోరం, పులివెందుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement