
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తరలించాలనుకుంటున్నారో ఓ స్పష్టత లేకుండా ముందుకు సాగారు. తొలుత కడపకు తరలించి.. అక్కడి నుంచి అంతా తిప్పుతూ ఉన్నారు. ఈ క్రమంలో యర్రగుంట్ల వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. ఆయన్ని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు.
ఎలాంటి నోటీసులు, వారెంట్ లేకుండా అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన అధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆ వాహానాన్ని ముందుకు కదలనీయలేదు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సుధీర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు..
‘‘మీరు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడ అవినాష్‌ను దించేస్తాం’’ అంటూ పోలీసులు చెప్పడంతో.. తన నివాసానికి తీసుకెళ్లాలంటూ సుధీర్‌రెడ్డి అదే వాహనం ఎక్కారు. అధికార టీడీపీతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని.. పులివెందుల ఉప ఎన్నికకు అవినాష్ రెడ్డిని దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఇదీ చదవండి: బలవంతంగా ఇంట్లోంచి ఈడ్చుకొచ్చి.. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్
యర్రగుంట్లలో పోలీస్ వాహనంలోనే ఉండి సాక్షితో ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. ‘‘పులివెందులలో బయటివాళ్లను అనుమతించి.. ఇంట్లో ఉన్న నన్ను బలవంతంగా తరలిస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగమే. బీహార్‌లోనూ ఇంతదారుణమైన పరిస్థితులు ఉండవేమో. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంత ఘోరమైన.. చెత్త ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండవు. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా? లేదా?. దున్నపోతు మీద వర్షం పడినట్లు ఉంది ఈసీ తీరు. పది రోజుల నుంచి మొత్తుకుంటున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వేల మందిని బయటకు తీసుకొచ్చారు. వాళ్లతో మాపై దాడులు చేయించారు’’ అని మండిపడ్డారాయన.