స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయ
బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి చిరంజీవులు
ప్రొద్దుటూరు కల్చరల్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి చిరంజీవులు కోరారు. ఆదివారం స్థానిక ఎస్‌కే గ్రాండ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కులగణన జరపకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఏ నివేదికల ఆధారంగా అమలు చేస్తారో చెప్పాలన్నారు. 50 శాతం సీలింగ్ నిబంధనను అధిగమించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణన ఏడాదిలోపు పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. కులగణన పూర్తయితే బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం పైగానే విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణనతోనే సాధ్యమన్నారు. ఇందుకు బీసీ సంఘాల నాయకులు ఉద్యమాలకు నడుం బిగించాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం పార్లమెంట్ అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు, ప్రతాప్ నాయుడు పాల్గొన్నారు.


