కంపచెట్లలో చిన్నారి మృతదేహం
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని జె. నారాయణపురంలో జమాల్‌పల్లెకు వెళ్లే దారిలో అంగన్వాడీ పాఠశాల ఎదురుగా కంపచెట్లలో అప్పుడే పుట్టిన ఓ పురిటి శిశువు (ఆడ బిడ్డ)ను గుర్తించారు. మృత శిశువు కవర్‌లో తెల్లని వస్త్రంతో చుట్టబడి ఉండటాన్ని చూసిన చిన్నపిల్లలు సమీపంలోని పెద్దలకు తెలియపరిచారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృత శిశువును పరిశీలించారు. ఇప్పపెంట వీఆర్‌ఓ చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైకుపై నుంచి పడి మహిళ మృతి
పుల్లంపేట : మండల పరిధిలోని జాగువారిపల్లె సమీపంలో బైకుపై నుంచి జారి పడి మహిళ మృతి చెందింది. టి.బలిజపల్లెకు చెందిన సిద్దమ్మ (45) తన కుమారుడు ఉపేంద్రతో కలిసి రాజంపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు గాయాలై మృతి చెందింది.


