బతిమాలినా ఆపని డ్రైవర్
మైదుకూరు: ప్రయాణికుల పట్ల ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తన గ్రామానికి వెళ్లే స్టేజి వద్ద బస్సు ఆపమని బతిమలాడినా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ ససేమిరా అంటూ ముందుకు తీసుకెళ్లడంతో బస్సులో నుంచి దూకి ఓ విద్యార్థిని తీవ్ర గాయాల పాలైన సంఘటన మైదుకూరు వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని వేపరాలపల్లె గ్రామానికి చెందిన ధనికెల స్రవంతి అనే విద్యార్థిని చాపాడు మండలంలోని పల్లవోలు సీబీఐటీ కాలేజీలో బీటెక్ చదువుతోంది.
బుధవారం కాలేజీకి వెళ్లిన ఆ విద్యార్థిని, సాయంత్రం గ్రామానికి వెళ్లేందుకు మైదుకూరులో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కింది. బస్సు కర్నూలు–చిత్తూరు జాతీయ రహ దారి బైపాస్ వద్దకు రాగానే బస్సు ఆపాలని కండక్టర్‌ను కోరింది. కండక్టర్ బస్సు ఆపాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పినా అతను పట్టించుకోకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సును ఆపా లని విద్యార్థిని బతిమలాడింది. కండక్టర్, ప్రయాణికులు గట్టిగా కేకలు వేసి ఆపాలని చెప్పినా నిర్లక్ష్యంతో డ్రైవర్ బస్సును నడుపుతూనే ఉన్నాడు. విద్యార్థిని దిగాల్సిన స్టేజి నుంచి కిలోమీటర్ దూరంలోని శ్రీనగరం గ్రామ సమీపంలో బస్సు ఆపడేమోనన్న ఆందోళనతో విద్యార్థిని స్రవంతి బస్సులో నుంచి దూకింది. విద్యార్థిని తలకు, భుజాలపై తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీనగరం గ్రామస్తులు, ప్రయాణికులు గాయపడిన విద్యార్థిని మైదుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మైదుకూరు డిపో మేనేజర్ శ్రీలత ఆసుపత్రిలో స్రవంతిని పరామర్శించారు. అర్బన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విషయం తెలుసుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


