15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రామాపురం:నిందితుడితో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మదనమోహన్, సిబ్బంది
సిద్దవటం:నిందితుడు, ఎర్రచందనం దుంగలతో సిద్దవటం రేంజర్ కళావతి, సిబ్బంది
సిద్దవటం : కూంబింగ్ సిబ్బంది దాడి నిర్వహించి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తమిళ కూలీని అరెస్టు చేసినట్లు రేంజర్ కళావతి తెలిపారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ ఆదేశాల మేరకు కూంబింగ్ నిర్వహించామన్నారు. సిద్దవటం రేంజ్‌లోని గొల్లపల్లి బీటు, గొల్లపల్లి సెక్షన్ నల్లబండలు, సాలుపెంట ప్రదేశంలో మంగళవారం తమ సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తుండగా కొందరు ఎర్రచందనం దుంగలు మోసుకొని వెళ్లడాన్ని తాము చూశామన్నారు. వారు తమ సిబ్బందిని చూసి పరారవుతుండటంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో ఒక తమిళ కూలీని అరెస్ట్ చేశామన్నారు. అక్కడ లభించిన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల బరువు 479 కేజీలు ఉంటుందని, వీటి విలువ రూ.1.39 లక్షలు చేస్తుందన్నారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడిన నిందితుడు తమిళనాడు రాష్ట్రం వేలూరు తాలూకా చిన్నతటన్ కొంటై గ్రామానికి చెందిన మునిస్వామి అలియాస్ ముత్తుస్వామి అన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టుకు హాజరుపరిచామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేసు, గొల్లపల్లి ఎఫ్‌బీఓ మధు, సిద్దవటం ఏబీఓ హైమావతి, ప్రొటెక్షన్ వాచర్లు, సైక్లింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
రామాపురం : రాయచోటి రేంజ్ రామాపురం మండలంలోని గువ్వలచెరువు తూర్పు బీటు పరిధిలో కూంబింగ్ నిర్వహించి ఒక తమిళ కూలీని అరెస్టు చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మదనమోహన్ తెలిపిన వివరాల మేరకు.. వేపమాను బోటు ప్రదేశంలో ఏడుగురు తమిళ కూలీలు ఎర్రచందనం చెట్లు నరుకుతుండగా చుట్టుముట్టి పట్టుకునేందుకు ప్రయత్నించగా తమిళనాడుకు చెందిన కన్నాబిరాన్ పట్టుబడ్డాడు. మిగిలిన వారందరూ తప్పించుకున్నారు. అతని వద్ద నుంచి రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుపతి రెడ్ శాండిల్ కోర్టుకు తరలించారు. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తమిళ కూలీ అరెస్టు
15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం


