‘వెన్నుపోటు దినం’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డా. దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలు ఆవిష్కరించారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2025 జూన్ 4 నాటికి ఏడాది పూర్తవుతుందన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 ఇతర హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు అన్ని లెక్కలు చూసుకున్నాము, సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారన్నారు. హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వీరు నట్టేట ముంచారన్నారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని నిరసిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు చేపట్టి, అధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మూల్యాంకనం చేసేందుకు కూడా చేతకాలేదు
మూల్యాంకనం సక్రమంగా చేసి పదో తరగతి పేపర్లు దిద్దేందుకు కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. పదవ తరగతిలో రీ వెరిఫికేషన్‌కు 66వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 11500 మంది పాస్ అయ్యారన్నారు. ఆలోపే ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి గడువు దాటిపోయిందని, విద్యార్థుల ఆందోళనతో గడువు పెంచారన్నారు. ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో 90కిపైగా మార్కులు వచ్చాయని, సోషల్‌లో మాత్రమే 22 మార్కులు వచ్చాయన్నారు. అడిషనల్ పేపర్లు కౌంట్ చేయకపోవడం వల్లే ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినట్లు రీవెరిఫికేషన్‌లో తేలిందన్నారు. ఇంత బాధ్యతారహితంగా పేపర్లు దిద్ది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. దరఖాస్తు చేసిన వారి పేపర్లలోనే ఇన్ని తప్పులు ఉంటే దరఖాస్తు చేయని వారు చాలామందే ఉన్నారన్నారు. ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మానసిక క్షోభ ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. గతంలో ఒక రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహిస్తూ సంబంధిత రైల్వే మంత్రి రాజీనామా చేశారని, మూల్యాంకనంలో తప్పులు దొర్లినందుకు టీచర్లను సస్పెండ్‌చేస్తే సరిపోదని, విద్యాశాఖామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించి గత ఏడాది ఇచ్చిన ఒక్క సిలిండర్ డబ్బులు కూడా చాలామంది ఖాతాల్లో వేయలేదన్నారు. ఎన్నికల ముందు చదువుకునే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. పైగా వలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్ల ఉద్యోగాలు ఊడగొట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పులి సునీల్‌కుమార్, యానాదయ్య, ఎస్. వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, సీహెచ్ వినోద్, బంగారు నాగయ్య, దాసరి శివప్రసాద్, షఫీ, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకట సుబ్బమ్మ, బి. మరియలు, సునీత తదితరులు పాల్గొన్నారు.
4వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు
విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుల పిలుపు


