అడుగంటిన భూగర్భ జలాలకుతోడు విద్యుత్ లోవోల్టేజీ, సరఫరాలో అంతరాయం
ఈ చిత్రంలోని రైతు సంస్థాన్‌నారాయణపురం మండలం జనగామ గ్రామానికి చెందిన నెల్కంటి బాబు. ఆయన తనకున్న 15 ఎకరాలతోపాటు, మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 22 ఎకరాలకు 18 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. రెండు ఎకరాలు వరి, ఎకరం కంది, ఎకరం దోస సాగు చేశాడు. ఈ పంటలన్నింటికీ పెట్టుబడిగా సుమారు రూ.5 లక్షల వరకు పెట్టాడు. వర్షాలు పడక పత్తి, కంది చేలు ఎదగలేదు. కరెంట్ కోతలతో వరి, దోస ఎండిపోయింది.
సంస్థాన్‌నారాయణపురం మండలం
జనగాంలో ఎండిపోయిన పత్తి మొక్కలు
అనాజిపురంలో నెర్రెలు బారిన వరి పొలం
సాక్షి, యాదాద్రి: జిల్లాలో బోరు, బావుల ఆధారంగా సాగు చేసిన వరి, వర్షాధారంగా సాగు చేసిన పత్తి చేలు నీరు లేక ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 2.26 లక్షల ఎకరాల్లో వరి, 1.12 లక్షల ఎకరాల్లో పత్తి, 17 వేల ఎకరాల్లో కంది సాగు చేశారు. విత్తనాలు, కలుపు తీత, మందులు, కూలీలు తదితర ఖర్చుల కోసం రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అడుగంటిన భూగర్భ జలాలకు తోడు, లో–వోల్టేజీ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల ఎండిపోయిన వరిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు.
నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో..
నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోని మండలాల్లో భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడి సాగు చేసిన వరి, పత్తి, కంది పంటలతో పాటు కూరగాయలు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
కాలిపోతున్న స్టార్టర్లు
విద్యుత్ సరఫరాలో నిరంతరం ఏర్పడుతున్న హెచ్చుతగ్గులు, సాంకేతిక లోపాల కారణంగా వ్యవసాయ విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి, గౌస్ నగర్, భువనగిరి తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో స్టార్టర్లు, మోటార్లు కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో స్టార్టర్, మోటార్ బాక్స్ మరమ్మతు చేయడానికి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది.
సబ్ స్టేషన్ల ఎదుట నిరసనలు
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భువనగిరి మండలం తుక్కాపురం, ఆలేరు మండలం కొలనుపాక, సంస్థాన్ నారాయణపురం, జనగాం సబ్ స్టేషన్ల వద్ద రైతులు ఆందోళనలు చేపట్టారు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో రైతులు ధర్నాలు నిర్వహించారు.
ఫ నీరు లేక బీటలు వారుతున్న వరిచేలు
ఫ నిలువునా ఎండిపోతున్న పత్తి మొక్కలు
ఫ దిక్కుతోచని స్థితిలో రైతులు


