మట్టి మేలు తలపెట్టి | - | Sakshi
Sakshi News home page

మట్టి మేలు తలపెట్టి

Sep 13 2026 9:22 AM | Updated on Sep 13 2026 9:22 AM

20 ఏళ్లుగా మట్టి గణపయ్యే..

కులవృత్తిపై మమకారం..

పర్యావరణానికి ఉపకారం

రాజాపేట : ప్రస్తుత సాంకేతిక యుగంలో యువత చదువు పూర్తిచేసి ఉద్యోగాల వైపు పరుగులు తీస్తుంటే.. ఓ యువకుడు మాత్రం తన కులవృత్తిపై ఉన్న మమకారాన్ని చాటుకుంటున్నాడు. రాజాపేట మండలం కుర్రారం గ్రామానికి చెందిన తరిగొప్పుల భాస్కర్‌ ఇటు పర్యావరణ హితాన్ని, అటు తన పూర్వీకుల వృత్తిని బతికిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు. భాస్కర్‌ తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మి వ్యవసాయం చేస్తుంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న కుమ్మరి వృత్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఎమ్మెస్సీ చదువుతూనే మట్టి విగ్రహాల తయారీని ఎంచుకున్నాడు భాస్కర్‌. చెరువులు, కుంటల నుంచి బంకమట్టిని సేకరించి తన స్వగ్రామంలోనే గణనా థులను తయారు చేస్తున్నాడు. రంగులు కూడా సహజ సిద్ధమైనవే వాడుతున్నాడు. మట్టి వినాయకులను తక్కువ ధరలతో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అంతేకాకుండా భాస్కర్‌ యూట్యూబ్‌లో ఫోక్‌ సాంగ్స్‌కు దర్శకత్వంతో పాటు పొలిటికల్‌ సాంగ్స్‌కు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేసి పలు అవార్డులు కూడా అందుకున్నాడు.

ఎకో–ఫ్రెండ్లీ వినాయకుడికి పెద్దపీట వేస్తున్న పర్యావరణ ప్రేమికులు

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడుగులు

వినాయక చవితి అనగానే వాడవాడలా వెలిసే మండపాలు, కోలాహలం కళ్ల ముందు కదలాడుతుంది. అయితే పండుగ ఉత్సాహంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమని చాటిచెబుతున్నారు ఉమ్మడి జిల్లా వాసులు. మట్టి గణపతులను ప్రతిష్ఠించడమే కాకుండా.. మట్టి విగ్రహాలను ఉచితంగా పంచుతూ పర్యావరణ పరిక్షణకు పాటు పడుతున్నారు. పర్యావరణ హితంగా వినాయక ఉత్సవాలను జరుపుకుంటున్న వారిపై సాక్షి ప్రత్యేక కథనం..

భువనగిరి : భువనగిరి పట్టణంలోని కిసాన్‌నగర్‌కు చెందిన కిసాన్‌ యూత్‌ అసోసియేషన్‌ ఏర్పడి 48 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న యువకులు.. గత 20 సంవత్సరాలుగా కేవలం మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఒడిశాకు చెందిన కళాకారులతో 30 నుంచి 40 రోజుల పాటు శ్రమించి మండపం వద్దే విగ్రహాన్ని తయారు చేయిస్తారు. మట్టి విగ్రహాల తయారీకి పట్టణ శివారులోని హన్మాపురం చెరువు నుంచి మట్టి తీసుకొస్తారు. మట్టితో పాటు గడ్డిని ఉపయోగించి, సహజ రంగులు అద్దుతారు. దీంతో నిమజ్జనం చేసిన వెంటనే విగ్రహం కరిగిపోతుంది. మట్టితో ఎత్తైన విగ్రహాలను తయారు చేయడం కష్టమనే అపోహలను తొలగిస్తూ.. ఈసారి ఖైరతాబాద్‌ తరహాలో 26 అడుగుల ఎత్తైన పంచముఖ సంకటహర వినాయక విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఏటా గణనాథుడితో పాటు ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కూడా మట్టితోనే రూపొందిస్తారు. ఈసారి మహాకాళి, రుద్రావతారం, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమలను మట్టితోనే సుందరంగా తయారు చేశారు. పర్యావరణ హితం కోసమే మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఇతర మండపాల నిర్వాహకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement