ఆలేరు : ఆలేరు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్(బాలుర) పాఠశాల ఉపాధ్యాయుడు సైదులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్–ఫిన్‌లాండ్(బ్యాచ్–2)’కు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 33మంది ఉపాధ్యాయుల్లో ఆయనకు చోటు దక్కింది. విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఫిన్‌లాండ్‌లో అమలవుతున్న ఆధునిక విద్యావిధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణ, విద్యార్థి కేంద్రిత బోధన తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 3వ వరకు ఈ పర్యటన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌లాండ్‌లో అమలవుతున్న విద్యావిధానాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి ద్వారా పొందిన అనుభవాలను స్థానిక పాఠశాల విద్యకు అన్వయించుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని సైదులు తెలిపారు.
పోచంపల్లిని సందర్శించిన బిహార్ ట్రైనీ అధికారులు
భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో భారత్ దర్శన్ ప్రోగ్రాంలో పాల్గొన్న 114 మంది బిహార్ రాష్ట్రానికి ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారుల బృదం శనివారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు, డిజైన్‌లను పరిశీలించారు. జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు.. ఇక్కత్ పరిశ్రమ ప్రాముఖ్యతను వారికి వివరించారు.


