సాక్షి, యాదాద్రి : ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్లతో పాటు తహసీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యాలయాల్లో ముసాయిదా జాబితాలను ప్రదర్శించనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఓట్లు తొలిగి పోనున్నాయోనని ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నెలరోజులకు పైగా..
జిల్లాలో జూన్ 25నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దాదాపు నెలన్నర రోజుల వరకు సర్ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్‌ఓలు ఇల్లిల్లూ తిరిగి ఫారాలను ఇచ్చి, పూర్తి చేసిన తర్వాత తిరిగి తీసుకున్నారు. ఇందులో మృతిచెందిన వారితోపాటు వలస వెళ్లిన ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు వివిధ కారణాలతో రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న ఓటర్లను గుర్తించారు. ఈ క్రమంలో ప్రస్తుతం వెలువడే జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అని ఓటర్లలో అయోమయం నెలకొంది.
26 వేలకుపైగా ఓట్లు గల్లంతు?
జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,59,943 మంది ఓటర్ల ఉండగా ఇందులో ఆలేరు నియోజకవర్గంలో 2,38,040 మంది, భువనగిరిలో 2,21,903 మంది ఉన్నారు. వీరందరికీ 566 మంది బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. ఇందులో 4,33,745 మంది ఓటర్ల ఫారాలను డిజిటలైజ్ చేశారు. వీటిలో బీఎల్‌ఓలు 26,197 ఫారాలను సేకరించలేక పోయారు. 84,333 ఫారాలు తప్పుగా నమోదయ్యాయి. ఈ జాబితాలో ఉన్న ఓట్లను ఎన్నికల అధికారులు సోమవారం ప్రకటించే జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. వీటిలో మొత్తంగా 26 వేలకుపై ఓట్లు గల్లంతు కానున్నట్టు తెలుస్తోంది.
అప్పీల్‌కు నెలరోజుల సమయం
డిజిటలైజేషన్ పూర్తయిన ప్రతి ఓటరుకు సోమవారం ప్రకటించే ముసాయిదా జాబితాలో చోటు ఉండకపోవచ్చని తెలుస్తోంది. డిజిటలైజేషన్ పూర్తయినప్పటికీ పూరించిన ఫారాలలో తప్పులుంటే వీటిని సైతం ఎన్నికల అధికారులు తొలగించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇప్పటికే డిజిటలైజేషన్ కానీ 84 వేలకు మించి ముసాయిదా ఓటరు జాబితాలో చోటుదక్కకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఈ ముసాయిదా జాబితాలో చోటుదక్కని ఓటర్లు నెలరోజుల పాటు అప్పీల్ చేసుకునే వీలు ఉంది. ముసాయిదా జాబితా ప్రకటించిన అనంతరం అధికారులు ఎన్యూమరేషన్ ఫారంలో తప్పొప్పులు డిజిటలైజేషన్ వలస వెళ్లిన వారికి నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నోటీసులకు ఓటర్లు సరైన ఆధారాలతో తిరిగి అప్పగిస్తే తిరిగి తుది జాబితాలో ఓటు కల్పించనున్నారు. డిజిటలైజేషన్‌లో 26,163 ఓట్లు దాదాపు లేనట్లే. అన్‌కలెక్ట్‌బుల్‌గా మిగిలిన ఓట్ల కోసం మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు.
నేడే ముసాయిదా ఓటరు జాబితా విడుదల
ఫ 26 వేలకుపైగా ఓట్లకు ఎసరు?
ఫ గల్లంతయ్యే ఓట్లపై ఉత్కంఠ
ఫ అభ్యంతరాలు, అప్పీల్‌కు నెలరోజుల గడువు
నియోజకవర్గాల వారీగా సర్ వివరాలు..
అంశాల వారీగా ఆలేరు భువనగిరి
చనిపోయినవారు 3,519 3,654
వలసపోయింది 4,373 10,214
డబుల్ ఓటర్లు 1,954 1,112
ఆబ్సెంట్ ఓటర్లు 342 880
ఇతర ఓటర్లు 67 48
మొత్తం 10,255 15,908


