భువనగిరి: అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారుల నవ్వులు ఆ ఇళ్లలో శాశ్వతంగా దూరమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల కాసుల కక్కుర్తి, అలసత్వం.. డ్రైవర్ల నిర్లక్ష్యం.. వెరసి పసిప్రాణాలను మృతి ఒడికి చేరుస్తున్నాయి. గత జూన్ 27న భువనగిరి మండలం వడపర్తిలో బడి నుంచి ఇంటి వద్దకు బస్సులో వచ్చిన పెద్ద కుమారుడిని తీసుకెళ్లేందు తల్లి వెంట వచ్చిన చిన్నకుమారుడు అదే బస్సుకింద మృతిచెందగా.. తాజాగా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో అక్కను సాగనంపేందుకు బస్సు వద్దకు వెళ్లిన 21 నెలల పసిపాప అభిజ్ఞతార అదే స్కూల్ బస్సు చక్రాల కింద నలిగిపోవడం ప్రతీ ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. రెండు నెలల వ్యవధిలో కళ్లెదుటే తమ బిడ్డలు విగతజీవులుగా మారుతుంటే ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం.
నిబంధనలు గాలికి..
ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతను యాజమాన్యాలు గాలికి వదిలివేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా యాజామాన్యాలు పట్టించుకోవడం లేదు. పలు స్కూల్ బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.తనిఖీ సమయాలలో కొంత నిబంధనలు పాటిస్తున్నా పూర్తి స్థాయిలో భద్రత చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చాలా వరకు స్కూల్ బస్సుల్లో ఇనుప గ్రిల్స్ కనబడడంలేదు. అగ్ని ప్రమాదల నివారణ చర్యలు తీసుకోవడంలేదు. నామా మాత్రంగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఉంటున్నాయి. వాహనాలకు కనీస ఫిట్‌నెస్ పరీక్షలు చేయించకపోవడం, అనుభవజ్ఞు లైన డ్రైవర్లను పెట్టుకోకపోవడం.. అన్నింటికీ మించి చిన్నారులను సురక్షితంగా ఎక్కించి, దించేందుకు బస్సుల్లో కేర్ టేకర్ (అటెండర్) లేకపోవడం వల్లే పసిమొగ్గలు ఇలా చక్రాల కింద నలిగిపోతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల బస్సులు నడిపితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. ఫినెటస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగిఉండాలి. బస్సుల్లో తప్పనిసరిగా అటెండర్ ఉండాలి.
– సంగెం నరేష్, డీటీఓ
స్కూల్ బస్సు నిబంధనలు
ఏం చెబుతున్నాయంటే..
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 15 ఏళ్ల వరకు మాత్రమే స్కూల్ బస్సు నడపాలి
వాహనానికి ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉండాలి
డ్రైవర్‌కు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి
డ్రైవర్ 60 సంవత్సరాల వయస్సు పైబడి ఉండకూడదు
మద్యం సేవించి బస్సును నడపరాదు
బస్సులో విధిగా అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి
బస్సు ఎక్కే డోర్ వద్ద గ్రిల్స్ ఏర్పాటు చేయాలి
బస్సులో అటెండర్ ఉండాలి
బస్ ప్రవేశ ద్వారం వద్ద హ్యాండ్ బార్ ఏర్పాటు చేయాలి
విద్యార్థులు బస్సు ఎక్కెందుకు ప్రవేశద్వారం వద్ద మెట్టు అనుకూలంగా ఉండాలి
360 డిగ్రీల కోణంలో కనబడేలా అద్దాలు ఉండాలి
పసిప్రాణాలను బలిగొంటున్న ప్రైవేట్ స్కూళ్ల నిర్లక్ష్యం
ఫ రెండు నెలల వ్యవధిలో బస్సు కిందపడి ఇద్దరు చిన్నారులు మృతి
ఫ కన్నవారికి తీరని కడుపుకోత


