ఫ ప్రభుత్వం విడుదల చేసిన తాజా
మార్గదర్శకాల్లోనూ వీరి ప్రస్తావన కరువు
ఫ 12 ఏళ్లుగా తప్పని ఎదురుచూపులు
రాజాపేట : ఎన్నో ఏళ్లుగా పొగాకు ఘాటును భరిస్తూ, ఇంటి పట్టునే బీడీలు చుడుతూ జీవనోపాధి పొందుతున్న వేలాది మంది బీడీ కార్మికులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. అన్ని అర్హతలు ఉండి కూడా ప్రభుత్వం అందించే పెన్షన్ కోసం 12 సంవత్సరాలుగా వీరు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన చేయూత పింఛన్ మార్గదర్శకాల్లో బీడీ కార్మికుల ఊసే లేకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. జిల్లాలోని ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, భువనగిరి మండలాల్లో సుమారు 5వేల మందికి పైగా బీడీ కార్మికులు ఉన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల వ్యాప్తంగా తాజ్, దేశాయి వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీలతో పాటు మరో 15 నుంచి 20 చిన్న కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ప్రతినిధులు (టేకాదారులు) గ్రామాల్లో మహిళలతో బీడీలు తయారు చేయిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం కేవలం 924 మందికే పింఛన్ అందుతోంది. ఏళ్ల తరబడి పొగాకు వాసన పీల్చడం వల్ల బీడీ కార్మికులు కంటిచూపు మందగించడం, తీవ్రమైన తలనొప్పి, నడుము నొప్పులతో పాటు క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నామని, అర్హులందరికీ పింఛన్ మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
నిబంధనల శాపం..
గత ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవనభృతి (పింఛన్) అందించేందుకు నిబంధన పెట్టింది. 2014 ఫిబ్రవరి 28 కంటే ముందు నుంచి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతా కలిగి ఉన్నవారికి మాత్రమే పింఛన్ అని స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో చాలా మంది ఏళ్ల తరబడి బీడీలు చుడుతున్నప్పటికీ, టేకాదారుల నిర్వాకం వల్ల వారికి 2014 తర్వాత పీఎఫ్ కార్డులు వచ్చాయి. పీఎఫ్ ఉన్నప్పటికీ కేవలం ఈ కటాఫ్ డేట్ నిబంధన కారణంగా అర్హులైన వేలాది మంది కార్మికులు పింఛన్‌కు నోచుకోకుండా పోయారు.
రాజాపేట మండల కేంద్రానికి చెందిన దండె రేవతి చిన్నప్పటి నుంచే బీడీలు చుడుతోంది. భర్త కృష్ణ దినసరి కూలీ. ఇద్దరు కుమార్తెలు కాగా, ఉన్న ఒక్క కుమారుడు ఇటీవల మృతి చెందాడు. రేవతి 2005లో రాజాపేటకు వచ్చి స్థిరపడింది. అప్పటి నుంచి లక్ష్మీ గణేష్ బీడీల కంపెనీలో పనిచేస్తోంది. టేకాదారులు ఆమెకు 2015లో పీఎఫ్ కార్డు ఇచ్చారు. ప్రభుత్వం 2014 లోపు పీఎఫ్ ఉన్నవారికే పింఛన్‌కు అర్హులు అని ప్రకటించడంతో ఆమెకు పింఛన్ ఆగిపోయింది.
ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు
(గత ప్రభుత్వ లెక్కల ప్రకారం)
మండలం పింఛన్‌దారుల
సంఖ్య
భువనగిరి 112
ఆలేరు 328
రాజాపేట 295
యాదగిరిగుట్ట 97
తుర్కపల్లి 69
బొమ్మలరామారం 14
మోటకొండూరు 7
మోత్కూరు 1
గుండాల 1
మొత్తం 924


