పాలనాపరంగా భువనగిరి మున్సిపాలిటీలో భాగమైనప్పటికీ..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాగా ఆవిర్భవించి ఏళ్లు గడుస్తున్నా.. ప్రత్యేక జిల్లా పోలీస్ యంత్రాంగం ఏర్పాటైనా క్షేత్రస్థాయి పరిపాలన మాత్రం ఇంకా గందరగోళంలోనే కొట్టుమిట్టాడుతోంది. నిబంధనలు, ప్రణాళికలు లేకుండా ఉన్నతాధికారులు, పాలకులు తీసుకుంటున్న అరకొర నిర్ణయాలతో ప్రజలకు సౌలభ్యం కలగకపోగా, ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టతో పాటు రాయిగిరి పరిధిలో నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ జీఓలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. భవనాల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది కేటాయింపు జరగకపోవడంతో ఆయా స్టేషన్లు ఆచరణకు నోచుకోవడం లేదు.
టెంపుల్ భద్రతకు పీఎస్ ఏదీ
యాదగిరిగుట్ట భద్రత కోసం డీఎస్పీ స్థాయిలో ప్రత్యేక టెంపుల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, ఎనిమిది మంది ఏఎస్‌ఐలు, 18 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 88 మంది పోలీస్ కానిస్టేబుళ్లు ఇలా మొత్తం 123 మందిని కేటాయించారు. ప్రస్తుతం ఆ డీఎస్పీని కూడా తొలగించారు. కొండపైన ఏర్పాటు చేయాల్సిన పోలీస్‌స్టేషన్ రికార్డుల్లో ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి సిబ్బంది, సరైన ఆఫీసు లేకపోవడంతో ఆ పరిధిలోని భద్రతా పర్యవేక్షణ నామమాత్రంగా మారింది.
బీబీనగర్ ఎయిమ్స్ వద్ద కరువైన ఔట్‌పోస్ట్
బీబీనగర్ ఎయిమ్స్‌కు ప్రతిరోజూ వేలాది మంది రోగులు వస్తుంటారు. నిరంతరం రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఎస్‌ఐ స్థాయి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపై స్పష్టమైన పురోగతి లేకపోవడంతో భద్రతాపరమైన ఆందోళనకు దారితీస్తోంది.
ఇన్‌స్పెక్టర్ స్థాయి మూన్నాళ్ల ముచ్చటేనా...
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నప్పుడు ఆలేరు, మోత్కూరు, ఆత్మకూర్(ఎం) పోలీస్‌స్టేషన్ హౌజ్ ఆఫీసర్లుగా సీఐలను నియమించారు. అయితే, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, రాజకీయ జోక్యాల కారణంగా ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండానే సీఐలను తొలగించి మళ్లీ ఎస్‌ఐలకే బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఆలేరు సీఐని తొలగించి ఎస్‌ఐకి బాధ్యతలు ఇవ్వగా, గతంలోనే మోత్కూరు, ఆత్మకూర్(ఎం)ల నుంచి సీఐలను ఉపసంహరించుకున్నారు.
ఫ రాయిగిరి, గుట్టపై పోలీస్‌స్టేషన్లు తొలగించడంతో నామమాత్రంగా మారిన భద్రతా పర్యవేక్షణ
ఫ స్థానిక సమస్యలకు మున్సిపాలిటీకి, పోలీసు సేవల కోసం రూరల్ పీఎస్‌కు తిరుగుతున్న రాయిగిరి వాసులు
ఫ బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఔట్‌పోస్ట్ ఏర్పాటులోనూ జాప్యం
భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న రాయిగిరిలో నూతన పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసి ఒక ఎస్‌ఐ, ఇద్దరు ఏఎస్‌ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 21 మంది పోలీస్ కానిస్టేబు ళ్లు, ఇలా మొత్తం 28 మందిని కేటాయించారు. అయితే ప్రస్తుతం అక్కడ పోలీస్‌స్టేషన్‌ను తొలిగించారు. రాయిగిరి ప్రాంతం పాలనాపరంగా భువనగిరి మున్సిపాలిటీలో భాగమైనప్పటికీ, శాంతిభద్రతల పరంగా భువనగిరి రూరల్ పీఎస్ పరిధిలోకి వస్తుంది. దీంతో ప్రజలు స్థానిక సమస్యల కోసం మున్సిపాలిటీకి, పోలీసు సేవల కోసం రూరల్ పీఎస్‌కు తిరగాల్సి వస్తోంది. కలెక్టరేట్ రాయిగిరిలోనే ఉండడంతో నిత్యం ఏదో ఒక ఆందోళన కార్యక్రమం ఉంటుంది. దీంతో ఇక్కడ పోలీస్‌స్టేషన్ లేకపోవడంతో రూరల్ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.


