మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం పోలీసుల భారీ బందోబస్తు నడుమ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరయ్యారు. దళిత బంధు నిధులను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌కు చెందిన దళిత బంధు లబ్ధిదారులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేసే ప్రయత్నం చేశారు. సమావేశానికి వస్తున్న ఎమ్మెల్యేను వారు అడ్డుకునే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మోత్కూరు ఇన్‌స్పెక్టర్ సి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకు యత్నించిన బీఆర్‌ఎస్ దళిత బంధు లబ్ధిదారులకు పోలీసులు నచ్చజెప్పడంతో వారు ధర్నాను విరమించుకున్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల సింగిల్ టెండర్‌ను ఇప్పటికే మెజార్టీ కౌన్సిలర్ల తీర్మానం మేరకు రెండుసార్లు రద్దు చేయడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రూ.15 కోట్ల టెండర్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, రూ.1.27 కోట్ల నిల్వ నిధుల వినియోగం తదితర అంశాలపై ఎమ్మెల్యే, కౌన్సిలర్ల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయారు. దీంతో సమావేశంలో ఎలాంటి గందరగోళం ఏర్పడుతుందోనని ఓవైపు పోలీసులు, మరోవైపు ఇరు వర్గాలు మున్సిపల్ కార్యాలయం ఎదుట మోహరించి ఉత్కంఠగా ఎదురుచూశారు. ఎమ్మెల్యే సమావేశానికి హాజరయ్యే లోపే కౌన్సిలర్లు తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. ఎలాంటి గందరగోళం లేకుండా సమావేశం ముగిసింది. రూ.1.46 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
రూ.15 కోట్లతో నూతన పాలకవర్గానికి
సంబంధం లేదు : ఎమ్మెల్యే
మోత్కూరు మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల నిధులతో నూతనంగా ఏర్పడిన పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు. మోత్కూరు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం అనంతరం పాలక వర్గంతో కలిసి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో చైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, పలువురు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద పహారా కాస్తున్న పోలీసులు
మోత్కూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్
ఫ దళితబంధు లబ్ధిదారులు ఆందోళనకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు
ఫ ప్రశాంతంగా ముగిసిన సమావేశం


