గుర్రంపోడు : పండ్ల తోటల్లో మంచి దిగుబడులు, నాణ్యమైన ఫలాలు పొందాలంటే ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలను కూడా అందించాల్సి ఉంటుంది. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్‌లను రసాయన ఎరువుల రూపంలో అందిస్తున్నా.. సూక్ష్మపోషకాలైన జింక్, బోరాన్, ఐరన్, మాంగనీస్, కాపర్, మాలిబ్డినమ్‌లు మొక్కలకు అందక ఆకులు పసుపురంగులోకి మారడం, పూత, కాయ తగ్గడం, పండ్ల నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. రైతుల పరిభాషలో పల్లాకు తెగులుగా చెప్పబడే ఈ లక్షణాలు అన్ని ప్రధాన పండ్ల తోటల్లో సమస్యగా మారింది. బత్తాయి, నిమ్మ తోటల్లో సూక్ష్మధాతు లోపాల నివారణపై హాలియా ప్రాంతీయ ఉద్యానవన అధికారి కె. మురళి అందిస్తున్న సలహాలు, సూచనలు ఇవీ..
1. జింక్ లోపం : కొత్త ఆకులు చిన్నవిగా మారుతాయి. ఆకుల మధ్య భాగం పసుపు రంగులోకి మారడం, కొమ్మల ఎదుగుల తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ : లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున ఆకులపై పిచికారీ చేయాలి. లేదా భూమిలో తగిన మోతాదులో జింక్ సల్పేట్‌ను వేయాలి.
2. బోరాన్ : బోరాన్ లోపం వల్ల పూత, కాయధారణ తగ్గుతుంది. పండ్లు పగిలిపోవడం లేదా ఆకారంలో మార్పు రావడం జరుగుతుంది. పూత దశలోనే బోరాన్ లోపాన్ని నివారిస్తే మంచి దిగుబడులు వస్తాయి.
నివారణ : లీటరు నీటికి రెండు గ్రాముల బోరాక్స్‌ను కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ లోపాన్ని నివారించుకోవచ్చు.
3. ఐరన్ : ఐరన్ లోపం వల్ల కొత్త ఆకులు పసుపు రంగులోకి మారి ఈనెలు మాత్రమే ఆకుపచ్చగా కనిపిస్తాయి.
నివారణ : ఐరన్ లోపం ఉన్నప్పుడు చిలేటెడ్ ఐరన్ రెండు గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
4. మాంగనీస్ సల్ఫేట్ : ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ నిలిచిపోయి కొమ్మలు గిడసబారుతాయి.
నివారణ : మాంగనీస్ సల్ఫేట్ 0.5 శాతం ద్రావణంను ఆకులపై పిచికారీ చేయాలి.
పై మందులు విడిగా పిచికారీ చేయడంలో ఇబ్బందులు ఉంటే అన్నిరకాల సూక్ష్మపోషక లోపాల నివారణకు మార్కెట్‌లో లభించే ఫార్ములా–4 మరియు ఫార్ములా–6 మందులను పిచికారీ చేయడం ద్వారా సూక్ష్మపోషక లోపాలను నివారించుకోవచ్చు . సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్ట్‌లను వినియోగించడం ద్వారా నేలలో పోషకాల లభ్యత పెరిగి సూక్ష్మపోషక లోపాలు నివారించబడతాయి. నేలలో పీహెచ్ అధికంగా ఉంటే ఐరన్, జింక్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. పండ్ల తోటల్లో అధిక తేమ ఉంటే పోషకాల శోషణ తగ్గిపోతుంది. సరైన తేమ ఉండేలా నీటి యాజమాన్యం పాటించాలి. సమతుల్య ఎరువుల నిర్వహణ, సేంద్రియ ఎరువుల వినియోగం, సకాలంలో ఆకులపై పిచికారీ చేపడితే పండ్ల తోటల్లో సూక్ష్మపోషకాలను నివారించుకోవచ్చు.


