మిర్యాలగూడ అర్బన్ : బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. వన్‌టౌన్ సీఐ నాగభూషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వసుంధరాదేవి ఆదివారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అడ్రస్ అడిగినట్లు నటించి ఆమెను మాటల్లో పెట్టాడు. అదును చూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. నిందితుడు బైక్‌పై ఆంధ్రా వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి గురైన బంగారు గొలుసులు 9 తులాలు ఉంటాయని బాధితురాలు పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పశువులను తరలిస్తున్న లారీ పట్టివేత
వలిగొండ : అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని వలిగొండ మండల కేంద్రంలో శనివారం రాత్రి స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముత్తు కుమార్ తన లారీలో 23 పశువులు, గేదెను అక్రమంగా తరలిస్తుండగా శనివారం రాత్రి తొర్రూర్ చౌరస్తా వద్ద పెట్రోలింగ్ పోలీసులు ఆపారు. లారీని తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతి లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
కిరాణ దుకాణంలో చోరీ
మర్రిగూడ : మండల కేంద్రంలోని కిరాణ దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ ప్రధాన రహదారి పక్కన కొడాల గోపాల్‌రెడ్డి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న కిరాణ దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కౌంటర్‌లో దాచిన రూ.20వేల నగదుతో పాటు విలువైన వస్తువులు అపహరించారు. శనివారం ఉదయం గోపాల్‌రెడ్డి దుకాణాన్ని తెరిచి చూడగా సామగ్రి అస్తవ్యస్తంగా పడి ఉండడం, కౌంటర్‌లో దాచి ఉంచిన నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నాడు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
శాలిగౌరారం : ఇంట్లో టేబుల్ ఫ్యాన్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఆకారం గ్రామానికి చెందిన వలిశెట్టి సందీప్(33)కు భార్య, కుమారుడు ఉన్నారు. సందీప్ భార్య తన కుమారుడితో కలిసి తన తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న సందీప్ శనివారం రాత్రి భోజనం అనంతరం నిద్రకు ఉపక్రమించే సమయంలో టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం, అర్ధరాత్రి అవుతున్నా తలుపులు తెరిచి ఉండటంతో చుట్టపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే సందీప్ మృతిచెంది ఉన్నాడు.


