ఎకో గణనాథా.. ప్రకృతి ప్రదాత | - | Sakshi
Sakshi News home page

ఎకో గణనాథా.. ప్రకృతి ప్రదాత

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

ఆదరణ బాగుంది

కాలుష్యాన్ని తగ్గిద్దాం

ద్వారకాతిరుమల: వినాయక చవితి సమీపిస్తుండటంతో వీధివీధినా గణనాథుడి విగ్రహాల సందడి మొదలైంది. పెద్దపెద్ద విగ్రహాలు.. ఆకర్షణీయమైన రంగులు.. ప్రత్యేక అలంకరణలు భారీగా ఏర్పాటు చేయాలన్న అంచనాలతో కమిటీ సభ్యులు హడావిడి చేస్తున్నారు. అయితే ఉత్సవాలు ముగిసిన తర్వాత నిమజ్జనం రూపంలో జలవనరులపై పడే పర్యావరణ భారం ఆందోళన కలిగిస్తోంది. భక్తికి ప్రతీకగా నిలిచే వినాయకుడి విగ్రహం ప్రకృతికి భారంగా మారాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ మెదలాలి. మట్టి విగ్రహాల వైపు మళ్లి.. భక్తితో పాటు ప్రకృతిని కాపాడాలన్న సందేశాన్ని చాటాల్సిన సమయం ఆసన్నమైంది. వినాయక చవితి పండుగకు ఇంకా 19 రోజులు మాత్రమే సమయం ఉంది.

మట్టితోనే రూపం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 800 నుంచి 1,200 కుటుంబాలు విగ్రహాల తయారీపై ఆధారపడుతున్నట్టు అంచనా. వీరిలో 250 నుంచి 400 కుటుంబాలు మట్టి విగ్రహాల తయారీని జీవనాధారంగా చేసుకున్నాయి. వీరు నాణ్యమైన మట్టి, పత్తి, వరిగడ్డి, పీచు, ఇనుప ఊసలను ఉపయోగించి వినాయకుడి శరీర భాగాలను ఒక్కొక్కటిగా మలిచి.. జాగ్రత్తగా అమర్చి.. తుది రూపాన్ని ఇస్తున్నారు. ఆరిన తర్వాత సహజ రంగులతో అలంకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివారులో జాతీయ రహదారి పక్కన భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన పేరవరపు నాగేశ్వరరావు పాతికేళ్లుగా మట్టి విగ్రహాలకు జీవం పోస్తున్నారు. గత 3 నెలల క్రితం ప్రారంభమైన ఈ పనుల్లో నాగేశ్వరరావుకు తన భార్య అన్నపూర్ణ, రెండో కుమార్తె లంకా భారతి, పెద్ద అల్లుడు నాగరాజు, మనుమడు గౌతమ్‌ చేదోడువాదోడుగా నిలుస్తున్నారు.

నిమజ్జనం తర్వాత..

మట్టి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే అవి సహజంగా కరిగి మట్టిలో కలిసిపోతాయి. సహజ రంగులను వినియోగిస్తే రసాయన కాలుష్య ప్రమాదం కూడా తగ్గుతుంది. దీనికి భిన్నంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీఓపీ) విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో నిమజ్జనం తర్వాత అవశేషాలు జలవనరుల్లో పేరుకుపోయే అవకాశం ఉంది. పీఓపీ విగ్రహాలతో పలు అనర్థాలు కలుగుతున్నాయి. విగ్రహాలపై ఉపయోగించే కృత్రిమ రంగులు, అలంకరణ సామగ్రి, ప్లాస్టిక్‌, థర్మాకోల్‌ తదితరాలు కూడా నీటిలో వ్యర్థాల భారాన్ని పెంచుతాయి. దీంతో చెరువులు, కాలువలు, నదులు, జలాశయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామా? లేక ప్రకృతినే ముంచేస్తున్నామా? అనే ఆలోచన ప్రతి ఉత్సవ కమిటీలో రావాల్సిన అవసరం ఉంది.

పీఓపీ విగ్రహాలు, రసాయన రంగులతో పెరుగుతున్న కాలుష్యం

మట్టి వినాయక విగ్రహాలతో జలవనరులకు మేలు

ఉమ్మడి పశ్చిమలో ఊపందుకున్న విగ్రహాల తయారీ

ఐదు అడుగుల వరకు మట్టి గణేష్‌ విగ్రహాలను తయారు చేస్తున్నాం. అంతకంటే పెద్దవి కావాలంటే ముందుగానే ఆర్డర్‌ ఇవ్వాలి. విగ్రహం సైజును బట్టి ధర నిర్ణయిస్తాం. పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గతేడాది ఆర్డర్లపై 40కి పైగా విగ్రహాలు విక్రయించాం. ఈ ఏడాది ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఉంగుటూరు, తణుకుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆర్డర్లు వచ్చాయి.

–పేరవరపు నాగేశ్వరరావు, విగ్రహాల తయారీదారుడు

ప్రగాఢమైన భక్తిని చాటుతూ.. కాలుష్యాన్ని తగ్గిద్దాం. ఆడంబరాన్ని తగ్గించి.. ఆచరణను పెంచుదాం. మట్టి విగ్రహాలను ప్రోత్సహించి స్థానిక కళాకారుల జీవనానికి అండగా నిలుద్దాం. భూమి నుంచి వచ్చిన గణనాథుడిని.. తిరిగి భూమిలోనే కలిపే సంప్రదాయాన్ని కాపాడుకుందాం.

– బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌, న్యాయవాది, ఏలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement