శ్రీవారికి బంగారు, వెండి కవచాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి బంగారు, వెండి కవచాల సమర్పణ

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

శ్రీవారికి బంగారు, వెండి కవచాల సమర్పణ తాగునీటి కోసం వెళ్లి మృత్యువాత ప్రేయసి కాదనడంతో.. ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్‌

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్నకు ఓ భక్తుడి కుటుంబం రూ.92 లక్షల విలువైన బంగారు, వెండి కవచాలను బుధవారం బహుకరించింది. లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన వేగుంట సాంబశివరావు, సౌందర్యలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు 584 గ్రాముల బంగారంతో, అలాగే 507 గ్రాముల వెండితో తయారు చేయించిన కవచాలను ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను చైర్మన్‌, ఈఓ అభినందించారు. ఈఈ డీవీ భాస్కర్‌, దాత కుటుంబ సభ్యులు చేవూరి లక్ష్మీనారాయణ, చేవూరి ఈశ్వరప్రవీణ్‌ పాల్గొన్నారు.

ముదినేపల్లి రూరల్‌: తాగునీటి కోసం టీవీఎస్‌ మోపెడ్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా, లారీ డ్రైవర్‌ అజాగ్రత్త కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సింగరాయపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. పెడన మండలం చెన్నూరు శివారు గొల్లగూడెంకు చెందిన గొల్ల వెంకటేశ్వరరావు (60) బుధవారం సాయంత్రం తాగునీటి కోసం టీవీఎస్‌ మోపెడ్‌పై సింగరాయపాలెం వెళ్లి, తిరిగి వస్తున్నారు. అదే సమయంలో కోరుకొల్లు వైపు నుంచి సింగరాయపాలెం వస్తున్న లారీ... డ్రైవర్‌ అజాగ్రత్త కారణంగా ఆయన మోపెడ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశ్వరరావు కుమారుడు నాగబాబు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్‌ను విజయవాడ మాచవరానికి చెందిన భూమ శ్రీనివాసరాజుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఉంగుటూరు: కై కరం గ్రామానికి చెందిన అగ్గల కళ్యాణ్‌కుమార్‌ (22) అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్‌ బుధవారం స్థానిక విలేకరులకు వెల్లడించారు. కళ్యాణ్‌కుమార్‌ తల్లి 2021లో అనారోగ్యంతో మృతి చెందగా, తండ్రి కూడా లేకపోవడంతో అప్పటినుంచి అతను మానసికంగా కుంగిపోయాడు. దీనికి తోడు తాను ప్రేమించిన అమ్మాయి తిరస్కరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులు లేని లోటు, ప్రేమ విఫలమవ్వడం వంటి కారణాలతో తీవ్ర మానసిక క్షోభకు గురైన కళ్యాణ్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లోని దూలానికి సిల్క్‌ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాత్రి 12 గంటలకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్యభగవాన్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

శ్రీనగర్‌కాలనీ: మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాల పాల్పడుతున్న దొంగను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏసీపీ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా నెగ్గిపూడికి చెందిన నీలపు హర్షసాయివర్ధన్‌ కోడి పందేలు, బెట్టింగులకు అలవాటు పడి బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు, పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకటి మొత్తంగా నాలుగు బుల్లెట్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 11 దొంగతనాలు, ఒక పోక్సో కేసు, ఇటీవల 4 కేసులున్నాయని ఏసీపీ వెంకటరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

భార్య, కుమారుడు అదృశ్యం

ద్వారకాతిరుమల: భార్య, కుమారుడి అదృశ్యంపై భర్త చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం తిమ్మాపురంనకు చెందిన చికాకోలు రంగారావు స్కూల్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య ఈశ్వరి, ఇద్దరు మగ పిల్లలు సంతానం ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం అనంతరం రంగారావు తన పెద్ద కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రించాడు. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచి చూడగా భార్య ఈశ్వరి, రెండో కుమారుడు చరణ్‌ ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తన కుమారుడిని తీసుకుని బస్టాండ్‌ వద్ద కనిపించినట్లు ఎవరో చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి. సుధీర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement