లారీ ఢీకొని షిఫ్ట్‌ ఆపరేటర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని షిఫ్ట్‌ ఆపరేటర్‌ దుర్మరణం

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

తణుకు అర్బన్‌: జీవితంపై ఎన్నో ఆశలు.. పైళ్లె ఏడాది కూడా కాలేదు.. అప్పుడే నూరేళ్లాయువు ముగిసింది. భార్యను ఇంటికి తీసుకువద్దామని ఆశగా బయలుదేరిన ఆ యువకుడి ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. తణుకు మండలం పైడిపర్రులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. తేతలి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌గా తోరంగి కిరణ్‌ (27) విధులు నిర్వర్తిస్తున్నారు. అందరితోనూ కలివిడిగా ఉండే కిరణ్‌ ప్రయాణంలో ఎప్పుడూ భద్రతకు ప్రాధాన్యతనిస్తారు. విధులకు వచ్చినా, వెళ్లినా విధిగా హెల్మెట్‌ ధరించే అలవాటు ఆయనకుంది. బుధవారం మధ్యాహ్నం డ్యూటీ ముగిసిన తర్వాత.. పాలకోడేరు మండలం కోరుకొల్లులోని పుట్టింట్లో ఉన్న తన భార్య ఈశ్వరిని తీసుకువచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సరిగ్గా పైడిపర్రు – మండపాక రోడ్డులోకి రాగానే దూసుకొచ్చిన క్వారీ లారీ ఆయన ప్రాణాలను బలిగొంది. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో పాటు చక్రం తల పైనుంచి వెళ్లడంతో కిరణ్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో ఆయన హెల్మెట్‌ ధరించే ఉన్నప్పటికీ, ఆ ఘోర ప్రభావం నుంచి ప్రాణం నిలవలేకపోయింది.

తీరని శోకసంద్రంలో కుటుంబం..

కిరణ్‌కు వివాహమై ఇంకా ఏడాది కూడా కాలేదు. ఆషాఢ మాసం కావడంతో భార్యను అత్తగారి ఇంటి నుంచి తన స్వగ్రామం బొమ్మిడికి తీసుకెళ్లడానికి ఉత్సాహంగా బయలుదేరిన భర్త ఇలా విగతజీవిగా మారుతాడని ఆ భార్య ఊహించలేకపోయింది. ఆస్పత్రి మార్చురీ గది వద్ద భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు అక్కడివారందరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి రామకృష్ణారావు ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement