జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు అన్నదానం, ప్రసాదాల తయారీని పరిశీలించారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘మన మిత్ర’ డిజిటల్ సేవలు
రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలతో సమానంగా మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కూడా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. ఇంటి వద్ద నుంచే దర్శనం, సేవా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నరసాపురం: భార్యను హతమార్చిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ.. హైకోర్టు ఆదేశాలతో మధ్యంతర బెయిల్ పొంది పరారైన ఖైదీని నరసాపురం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్‌లో పట్టుకున్నట్లు నరసాపురం డీఎస్పీ సుధాకర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... 2008 జనవరి 22వ తేదీన నరసాపురానికి చెందిన ఉయ్యూరి వెంకటరమణ తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి క్రూరంగా హత్య చేశాడు. దీనిపై 2022 నవంబర్ 15వ తేదీన నరసాపురం 10వ అదనపు జిల్లా కోర్టు వెంకటరమణకు జీవిత ఖైదు విధించడంతో, అతను రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, వెంకటరమణ తాను హెచ్‌ఐవీ రోగినని, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. దీనిని పరిశీలించిన హైకోర్టు 2024 ఏప్రిల్ 24వ తేదీన మూడు నెలల బెయిల్ మంజూరు చేసి, గడువు ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. అయితే, వెంకటరమణ బెయిల్ గడువు ముగిసిన తర్వాత కూడా జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. ఖైదీని పట్టుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో నరసాపురం టౌన్ సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ ఖైదీ హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో తన రెండో భార్యతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం హైదరాబాద్ వెళ్లి నిఘా పెట్టగా, ఆ విషయం గమనించిన వెంకటరమణ అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి పారిపోయాడు. అక్కడ పోలీసులు అతనిని ఈనెల 22వ తేదీన పట్టుకుని, 24వ తేదీన హైకోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం వెంకటరమణను రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.


