చైర్మన్ సీటు కుంపటి
సాక్షి, భీమవరం: భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (భీమా ఉడా) కూటమిలో నామినేటెడ్ కుంపటి రాజేసింది. ఉడా చైర్మన్ పదవి తమదంటే తమదని కూటమిలో మూడు ముక్కలాట మొదలైంది. కూటమి పాలసీకి కట్టుబడి ఎన్నికల్లో తమ సీటు త్యాగం చేసిన వారితో పాటు సీనియర్లు చైర్మన్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆశావహులు తమ అధిష్టానం పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
భీమవరం కేంద్రంగా..
జిల్లాల పునర్విభజన అనంతరం భీమా ఉడా ఏర్పాటుకు కసరత్తు మొదలైనా ఎన్నికలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. తాజాగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం మున్సిపాల్టీలు, ఆకివీడు నగర పంచాయతీ, 19 మండలాల్లోని 282 గ్రామాలతో భీమా ఉడాని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం వారం క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్లానింగ్ ఆఫీసర్, ఇతర ఉద్యోగుల నియామకం, కార్యాలయం ఏర్పాటు, బడ్జెట్ కేటాయింపులపై ఇంకా స్పష్టత లేదు.
నామినేటెడ్ కమిటీ నియామకం
సభ్యుల సంఖ్య, అథారిటీ పరిధి మేరకు నామినేటెడ్ కమిటీ నియామకం చేస్తారు. కమిటీలో చైర్మన్‌తో పాటు ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పట్టణాభివృద్ధిలో అనుభవం ఉన్నవారిని ఎంపిక చేస్తారు. వైస్ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి లేదా జాయింట్ కలెక్టర్ హోదాలోని వారిని, అధికారిక సభ్యులుగా మున్సిపల్, టౌన్‌ప్లానింగ్, ఆర్‌అండ్‌బీ, ట్రెజరీ శాఖల్లో పనిచేసే వారిని నియామకం చేస్తుంటారు. ఏడాది నుంచి మూడేళ్లు కమిటీ పదవీ కాలం కాగా ప్రభుత్వ నిర్ణయం మేరకు పొడిగింపు అవకాశం ఉంటుంది. రోజువారీ పరిపాలనా వ్యవహారాల కోసం వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో అధికారులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
వర్గ విభేదాలతో మరింత రచ్చ
సీట్లు కోల్పోయిన వారి అసంతృప్తి కూటమికి చేటు చేయకుండా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు స్వయంగా ఫోన్లు చేసి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామంటూ బుజ్జగించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. భీమవరంలో జనసేన పోటీ చేయగా టీడీపీ నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావు. జనసేన నుంచి టికెట్ ఆశించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, తాడేపల్లిగూడెంలో టీడీపీ నేత వలవల బాబ్జి, నరసాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఎన్‌ఆర్‌ఐ కొవ్వలి యతిరాజరామ్మోహననాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, ఉండి నియోజకవర్గంలో జనసేన ఇన్‌చార్జి జుత్తుక నాగరాజు, పాలకొల్లులో జనసేన ఇన్‌చార్జి బోనం చినబాబు తదితర నేతలు ఉన్నారు. కూటమి వచ్చాక జరిగిన, ప్రస్తుతం జరుగునున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ప్రస్తావన లేకపోవడం, నామినేటెడ్ పోస్టులు భర్తీలోను అధిష్టానం తమను విస్మరించిందన్న అసంతృప్తితో పలువురు ఉన్నట్టు తెలుస్తోంది. అధినేత మాటకు కష్టపడి మిత్రపక్ష అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమకు గుర్తింపు లేకుండా పోయిందని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. భీమా ఉడా చైర్మన్ గిరీ కోసం వీరితో మరికొందరు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం తదితర చోట్ల కూటమిలోని వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. ఈ తరుణంలో భీమా ఉడా చైర్మన్ పదవి మరింత కుంపటిని రాజేస్తోంది.
ఏఐ సృష్టించిన చిత్రం
ఉడా కార్యకలాపాలు, నిధుల కేటాయింపులో కీలకమైన చైర్మన్ పదవిపై కూటమి నేతలు కన్నేశారు. కమిటీ ఏర్పాటుకు ఇంకా కసరత్తు జరుగుతున్న దాఖలాలు లేకున్నా ముందుగా కుర్చీలో ఖర్చీఫ్ వేసుకునే పనిలో పడ్డారు. మూడు పార్టీల్లోని సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటం కూటమిలో కుంపటి రాజేస్తోంది. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా జతకట్టడంతో అప్పటివరకు తామే అభ్యర్థిగా భావించి నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేసిన వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆచంట, తణుకు, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలను టీడీపీ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలను జనసేన, నరసాపురం పార్లమెంట్‌ను బీజేపీ పంచుకున్నాయి. సీట్లు సర్దుబాటుతో మిగిలిన వారి ఆశలు గల్లంతయ్యాయి.
కూటమిలో భీమా ఉడా కుంపటి
చైర్మన్ పదవి కోసం మూడు ముక్కలాట
మాదంటే మాదంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు
రేసులో పలువురు సీనియర్ల పేర్లు


